ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గీత కార్మికులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలో అమలవుతున్న మద్యం పాలసీలో కీలక మార్పులు చేస్తూ కొత్త బార్ పాలసీని తీసుకురానుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త పాలసీ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బార్లలో 10 శాతం బార్లు గీత కార్మికులకు కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మొత్తం 840 బార్లలో 84 బార్లు గీత వర్గాలకు రిజర్వ్ చేయనున్నట్టు సమాచారం. ఈ కేటాయింపు లాటరీ విధానంలో జరగనుండగా, ఇందుకు సంబంధించి ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ నిర్ణయం గీత కార్మికులకు ఆర్థికంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే వైన్ షాపుల కేటాయింపులో కూడా గీత కార్మికులకు 10 శాతం రిజర్వేషన్ అమలులో ఉంది.
ఇక కొత్త బార్ పాలసీలో లైసెన్స్ ఫీజుల విషయంలో ప్రభుత్వం రెండు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది: మొదటి ప్రతిపాదన ప్రకారం: నగర పంచాయతీలు – రూ.35 లక్షలు
మున్సిపాలిటీలు – రూ.55 లక్షలు
కార్పొరేషన్లు – రూ.65 లక్షలు
ప్రధాన నగర కార్పొరేషన్లు – రూ.75 లక్షలు
ఈ ప్రతిపాదన అమలుతో ఆదాయం తగ్గే అవకాశముండడంతో, బార్ల సంఖ్యను 840 నుంచి వెయ్యికి పైగా పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. రెండో ప్రతిపాదన ప్రకారం:
లైసెన్స్ ఫీజు పెంచినప్పటికీ బార్ల సంఖ్యను యథాతథంగా కొనసాగించనుంది.
దరఖాస్తు ఫీజు రూ.5 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో బార్లకు వేలం విధానంలో లైసెన్స్‌లు మంజూరు చేశారు. కానీ తాజా పాలసీలో లాటరీ విధానాన్ని అనుసరించనున్నారు. ప్రస్తుతం ఉన్న బార్లకు లైసెన్స్ పొడిగింపునిచ్చే ఆలోచన లేకుండా, అన్ని బార్లకూ తిరిగి లైసెన్స్‌లు జారీ చేయాలన్నదే ఎక్సైజ్ శాఖ ఉద్దేశం.