ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణహిత అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ-అమరావతి డిక్లరేషన్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, నెడ్ క్యాప్ ఎండీ కమలాకర్ పాల్గొన్నారు. ఈ డిక్లరేషన్ ద్వారా 2030 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఇటీవల అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్‌పై రెండు రోజుల పాటు సదస్సు నిర్వహించబడింది. ఈ సమ్మిట్‌లో దేశం, విదేశాల నుంచి వచ్చిన 600 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సులో చర్చించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వంతో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్‌ను రూపొందించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలను, అనుకూల వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి దేశంలోనే అతిపెద్ద ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేయడమే డిక్లరేషన్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రభుత్వం 2027 నాటికి రెండు గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ తయారీ సామర్థ్యాన్ని, 2029 నాటికి ఐదు గిగావాట్లకు పెంచే లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతేకాకుండా 2029 నాటికి సంవత్సరానికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సాధించాలని పేర్కొంది.
ప్రస్తుతం కిలో హైడ్రోజన్ గ్యాస్ ధర సుమారు రూ.460గా ఉండగా, దీనిని రూ.160కి తగ్గించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నామని సీఎం తెలిపారు. పరిశోధనలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.