ప్రస్తుత జీవితంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఒత్తిడికి గురవుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులు కూడా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. స్కూల్ విద్యార్థులకు ధ్యానం కోసం ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ ప్రభుత్వ పాఠశాలల్లో ధ్యానం చేయిస్తున్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా విద్యార్థులు ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం తో ఉన్నతంగా ఎదుగుతారని భావిస్తున్నారు. ప్రయోగాత్మక పద్ధతిలో ఇక్కడ దీనిని ప్రారంభించారు.
మహారాష్ట్ర కు చెందిన విపశ్యన ధ్యానం కేంద్రం వాలంటీర్లు ఈ కార్యక్రమానికి సహాయం చేస్తున్నారు. మొదటి దశలో జిల్లాలోని 8 గురుకుల పాఠశాలల్లో దీన్ని అమలు చేయనున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం 10 నిమిషాల పాటు దాదాపు 3,000 మంది విద్యార్థులు ఇలా ధ్యానం చేస్తారు.
హైదరాబాద్ నుంచి వచ్చిన విపశ్యన బృందం 30 మంది వచ్చి పాఠశాలల్లో ధ్యానం చేయిస్తున్నారు. విద్యార్థులకు మిత్ర (మానసిక శాంతి కోసం శిక్షణ) ధ్యాన ప్రక్రియలను ధ్వని వ్యవస్థ ద్వారా వచ్చే సందేశం ఆధారంగా నేర్పిస్తున్నారు. ఉపాధ్యాయులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు.
ఈ ధ్యానాన్ని మొదట గురుకులాల్లో ప్రారంభించి, తరువాత ఉన్నత పాఠశాలల్లో అమలు చేయనున్నారు. ధ్యానం ప్రారంభించిన 45 రోజులకు విద్యార్థుల్లో వచ్చిన మార్పులను ఉపాధ్యాయులు, అధికారులు, విపశ్యన ప్రతినిధులు పరిశీలిస్తారు. గతంలో పాడేరు ప్రాంతంలో అమలు చేసి విజయవంతం కావడంతో, విపశ్యన సంస్థ ఏడాది పాటు ఉచిత శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చింది. అయితే వారికి వసతి, రవాణా సదుపాయం కల్పిస్తున్నారు.
2001 నుంచి మహారాష్ట్రలో విపశ్యన సంస్థ ధ్యాన శిక్షణ ఇస్తోంది. ఇప్పటివరకు 2.5 కోట్ల మంది విద్యార్థులు, లక్ష మంది ఉపాధ్యాయులు శిక్షణ పొందారు. ధ్యానం అభ్యాసం చేసిన విద్యార్థులు మానసికంగా ప్రశాంతంగా, చురుకుగా ఉంటారని, క్రమశిక్షణ పెరుగుతుందని చెబుతున్నారు.
ఏపీ ప్రభుత్వం ధ్యానం, యోగా వంటి అంశాలపై ఫోకస్ పెడుతోంది. ఇటీవల విశాఖపట్నం వేదికగా యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.