రాజధాని అమరావతికి కొత్త రూపు ఇవ్వడానికి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయంలో జరిగిన 51వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో 9 ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఇందులో భాగంగా రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.904 కోట్ల నిధుల కేటాయింపు జరిగింది. అలాగే, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం రూ.411 కోట్లు, వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కోసం రూ.376.6 కోట్లతో ఏర్పాట్లు చేయాలని అథారిటీ అంగీకరించింది. భూసమీకరణ పథకంలో ఇచ్చే యాజమాన్య ధృవీకరణ సర్టిఫికేట్‌లో ‘అసైన్డ్’ అనే పదాన్ని తొలగించేందుకు కూడా ఆమోదం తెలిపింది.
అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్, రివర్‌ఫ్రంట్, ఇన్నర్ రింగ్ రోడ్, రోప్‌వే వంటి ప్రాజెక్టులకు ప్రత్యేక ఎస్పీవీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరిలోని ఆత్మకూరు వద్ద 78 ఎకరాల్లో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుకు కూడా అథారిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ జెమ్స్ అండ్ జ్యూవెలరీ పార్క్ ఏర్పడి రూ.5,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, దాంతో 20 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు పేర్కొన్నారు. అదనంగా విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు చెరో 100 ఎకరాలు భూమి కేటాయించారు.
కృష్ణా నదిపై నిర్మించబోయే ఐకానిక్ వంతెనకు కూచిపూడి నృత్య భంగిమతో కూడిన అద్భుతమైన డిజైన్ ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు. నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈ సీజన్‌లోనే రాజధానికి ఒక రూపం ఇవ్వాలని స్పష్టం చేశారు. త్వరలోనే బయో ఇంజినీరింగ్ యూనివర్సిటీ కూడా అమరావతిలో వస్తుందని తెలిపారు. రాజధాని పరిధిలో కాలుష్యరహిత పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ ప్రాజెక్టు ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఉండాలని, అమరావతి నిర్మాణాలు అంతర్జాతీయ ప్రమాణాలతో, ఐకానిక్‌గా నిలవాలని సీఎం దిశానిర్దేశం చేశారు.