అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) నిర్మాణానికి వేగం అందుతోంది. రాజధానిని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా అమరావతి చుట్టూ 180 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీనికోసం భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అవసరమైన సర్వే నంబర్లను అధికారులు ఖరారు చేసి, ఆ భూములపై రిజిస్ట్రేషన్లు, లేఅవుట్లు, నాలా ఫీజులు నిలిపివేశారు. దీంతో ప్రాజెక్టుపై ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురుతున్నాయి. ఆ ప్రాంతాల్లో భూముల ధరలు కూడా ఎగబాకుతున్నాయి.
గతంలో టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లగా, వైసీపీ హయాంలో నిలిచిపోయింది. ఇప్పుడు టీడీపీ కూటమి మళ్లీ అధికారంలోకి రాగానే ప్రాజెక్టు తిరిగి పుంజుకుంది. చిన్న మార్పులతో భూసేకరణను కొత్త ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో నాలుగు మండలాలు, 18 గ్రామాల్లో భూసేకరణ జరగనుంది. రైతుల ప్రయోజనాలను కాపాడుతూ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మొదట 70 మీటర్ల వెడల్పుతో రహదారి ప్రణాళిక వేసినా.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు 140 మీటర్ల వెడల్పుతో నిర్మించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అదనంగా వచ్చే రూ.1000 కోట్ల భూసేకరణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.
అమరావతిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, క్రికెట్ స్టేడియం, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి మెగా ప్రాజెక్టులు రాబోతున్నందున.. రాబోయే దశాబ్దాల అవసరాలకు సరిపోయేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.