ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలుకానుంది. 2026 జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సన్నాహాలు ప్రారంభించింది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగియకముందే ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పంచాయతీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లకు లేఖలు రాసి, ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని ఆదేశించారు.
ప్రస్తుత సర్పంచుల పదవీకాలం 2026 ఏప్రిల్‌లో ముగియనుండగా, మున్సిపల్, కార్పొరేషన్, నగరపంచాయతీ కౌన్సిలర్ల పదవీకాలం 2026 మార్చిలోనే పూర్తవుతుంది. చట్టం ప్రకారం పదవీకాలం ముగియడానికి మూడునెలల ముందే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండటంతో, జనవరి నెలలోనే పోలింగ్ జరగాలని SEC నిర్ణయించింది.
ఈ క్రమంలో షెడ్యూల్‌ను కూడా ఖరారు చేశారు. అక్టోబరు 15లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు పూర్తి చేయాలి. నవంబరు 15లోగా ఓటర్ల జాబితా ప్రచురణ జరగనుంది. పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంల సిద్దత, అధికారులు నియామకం నవంబరు 30లోగా పూర్తి కానుంది. డిసెంబరు మధ్యలో రిజర్వేషన్లు ఖరారు చేసి, డిసెంబరు చివర్లో రాజకీయ పార్టీలతో సమావేశాలు ఉంటాయి. చివరగా 2026 జనవరిలో నోటిఫికేషన్ విడుదలై ఎన్నికలు జరుగుతాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు జనవరిలో, ఎంపీటీసీ/జెడ్పీటీసీ ఎన్నికలు జులైలో జరగనున్నాయి.