ఏపీ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈరోజు రాత్రి ఆయన ఢిల్లీలోకి చేరుకోనున్నారు. రేపు (సెప్టెంబర్ 5) ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ప్రధానితో సమావేశం పూర్తయ్యాక అదే రోజు మధ్యాహ్నానికల్లా తిరిగి రాష్ట్రానికి చేరుకొని అమరావతిలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.
జీఎస్టీ చారిత్రాత్మక సంస్కరణలను మంత్రి లోకేశ్ స్వాగతించారు. నాలుగు శ్లాబులను రెండుకు తగ్గించడం, నిత్యావసరాలపై పన్ను రేట్లను తగ్గించడం వంటి నిర్ణయాలు దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. సరళమైన పన్నుల విధానం వృద్ధికి దారితీస్తుందని, ఈ సంస్కరణలు దేశానికి ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు.
ప్రత్యేకంగా పెన్సిళ్లు, షార్ప్‌నర్లు, వ్యాయామ పుస్తకాలు, మ్యాపులు, చార్టులపై జీఎస్టీ తగ్గించడాన్ని మంత్రి లోకేశ్ అభినందించారు. ఈ నిర్ణయం విద్యార్థుల తల్లిదండ్రులకు పెద్ద ఊరటనిస్తుందని, విద్య ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే దిశగా ఒక మంచి అడుగని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకువచ్చినందుకు ప్రధాని మోదీని లోకేశ్ ప్రశంసించారు.