రాష్ట్రంలోని స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర 5వ ఆర్థిక సంఘం గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రూపొందించిన నివేదికను బుధవారం ప్రభుత్వానికి అందజేసింది. సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో జరిగిన సమావేశంలో ఆర్థిక సంఘం చైర్‌పర్సన్ రత్నకుమారి, సభ్యులు ప్రసాదరావు, కృపారావు నివేదికను సమర్పించారు.
ఈ సందర్భంగా ఆర్థిక సంఘం సభ్యులు మాట్లాడుతూ.. స్థానిక సంస్థలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు, వాటి పనితీరును మెరుగుపరిచేందుకు అనేక కీలక సిఫార్సులు చేసినట్లు వివరించారు. కేవలం ఆర్థిక రంగానికి మాత్రమే కాకుండా, పాలన, నిర్వహణ, పారదర్శకత, సేవల అందజేత వంటి అంశాల్లో కూడా సూచనలు చేసినట్లు తెలిపారు.
ప్రజలకు గ్రామీణ, పట్టణ స్థాయిలో మెరుగైన సేవలు అందించడమే ఈ సిఫార్సుల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్థిక, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం ఇప్పటికే స్థానిక సంస్థల బలోపేతంపై దృష్టి పెట్టిన నేపథ్యంలో.. ఈ నివేదికకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. త్వరలోనే ప్రభుత్వం సిఫార్సులను పరిశీలించి తదుపరి కార్యాచరణను ప్రకటించనుంది.