రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలిపివేయాలని ఇప్పటికే పలు మార్లు సూచించిన ట్రంప్, ఇప్పుడు మళ్లీ కఠిన స్వరంతో స్పందించారు. యుద్ధంపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని పుతిన్‌ను కోరుతూ, ఆలస్యం జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు.
పుతిన్ నిర్ణయం అమెరికాకు అనుకూలంగా లేకపోతే పరిస్థితులు ప్రమాదకరంగా మారతాయని ట్రంప్ హెచ్చరించారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని ఆయన సూచించారు. ఈ మేరకు వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ట్రంప్, “ఇకపై నేను చెప్పేదేమీ లేదు.. రష్యా తీసుకునే నిర్ణయం ఆధారంగానే మా వైఖరి నిర్ణయించబడుతుంది” అని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే రష్యాపై పలు ఆంక్షలు అమల్లో ఉన్నాయని గుర్తుచేసిన ట్రంప్, యుద్ధాన్ని కొనసాగిస్తే కొత్త ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. ప్రపంచం మొత్తం ఈ పరిణామాలను గమనిస్తోందని, త్వరలో ఏం జరుగుతుందో చూడాలని అన్నారు. అమెరికా వైఖరి ఇప్పుడు పూర్తిగా రష్యా నిర్ణయంపైనే ఆధారపడి ఉందని ఆయన స్పష్టం చేశారు.