ఆంధ్రప్రదేశ్‌లో 108 అంబులెన్స్ సేవలు కొత్త రూపంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో నీలం రంగులో ఉన్న ఈ వాహనాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం తెలుపు, ఎరుపు, పసుపు రంగుల్లోకి మార్చింది. రాత్రి వేళల్లో స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ టేపులు అమర్చారు. ఈ కొత్త మోడల్ వాహనాలను కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామికవాడలో తయారు చేసి, రాష్ట్రంలోని జిల్లాలకు పంపించారు.
ఈ అంబులెన్స్‌ల ప్రత్యేకత ఏమిటంటే—అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఐసీయూ వెంటిలేటర్, అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ సదుపాయం అందుబాటులో ఉండడం. రోగికి వాహనంలోనే ఆక్సిజన్, వెంటిలేటర్ సదుపాయం కల్పించే వీలుంది. దీంతో ఆస్పత్రి చేరకముందే అత్యవసర చికిత్స అందించవచ్చు. ఒకేసారి ముగ్గురు రోగులకు అత్యవసర వైద్యం అందించగల సామర్థ్యం ఈ వాహనాల్లో ఉంది.
ఇకపోతే, కాలం చెల్లిన 108 వాహనాలను మరమ్మతులు చేసి మళ్లీ వినియోగంలోకి తెస్తున్నారు. డ్రైవర్లపై కూడా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. మద్యం సేవించి డ్యూటీకి హాజరుకాకుండా వారికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేస్తున్నారు. ఇకపై అంబులెన్స్‌లపై రాజకీయ నేతల ఫోటోలు లేకుండా కేవలం ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉంచారు. అదనంగా, ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం 104 వాహనాలను కూడా ‘సంజీవని’ పేరుతో ప్రవేశపెట్టారు. వీటిపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి సత్యకుమార్ ఫోటోలు ఉన్నాయి.