ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధుల కోసం ప్రభుత్వం సీనియర్ సిటిజన్ కార్డులు ఇస్తున్న సంగతి తెలిసిందే. 60 ఏళ్లు నిండిన పురుషులు, 58 ఏళ్లు నిండిన మహిళలు ఈ కార్డు కోసం అర్హులు. తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఈ కార్డు కోసం రూ.40 ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ఇకపై ఆ ఫీజు పూర్తిగా రద్దు చేసింది. ఇప్పుడు ఎలాంటి రుసుము లేకుండానే ఈ కార్డులు ఉచితంగా లభిస్తాయి. ప్రభుత్వం ఈ కార్డులను డిజిటల్ రూపంలో అందజేస్తోంది.
అయితే కార్డు దరఖాస్తుల విషయంలో కొంత ఇబ్బంది వస్తోంది. సీనియర్ సిటిజన్ కార్డు కోసం వెబ్‌సైట్‌లో సమస్యలు ఉండటంతో చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు సాంకేతిక సమస్యలు తొలగించే పనిలో ఉన్నారని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారు.
ఈ సీనియర్ సిటిజన్ కార్డుతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఆర్టీసీ బస్సు ప్రయాణంలో 25 శాతం రాయితీ, ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యం, పన్ను మినహాయింపులు, ఆరోగ్య సేవల్లో సౌకర్యాలు అందుతాయి. ముఖ్యంగా కేంద్రం ఇచ్చే ‘ఆయుష్మాన్ భారత్’ పథకం కింద ఏడాదికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స లభిస్తుంది. వృద్ధులు అయితే ప్రభుత్వం ఈ కార్డులను నేరుగా ఇంటికే పంపిస్తే మరింత సౌకర్యంగా ఉంటుందని కోరుతున్నారు.