ఉత్తర తుర్కియేలోని జోంగుల్డాక్ తీరంలో జరిగిన ఓ షాకింగ్ ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఓ లగ్జరీ నౌక, ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే సముద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సమాచారం ప్రకారం, మెడ్ యిల్మాజ్ షిప్‌యార్డ్‌లో నిర్మించబడిన ఈ నౌకకు దాదాపు 1 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.8.74 కోట్లు) ఖర్చయింది. మంగళవారం ప్రయాణికులు, సిబ్బంది హాజరైన వేడుకల మధ్య ఈ నౌక తన తొలి ప్రయాణం మొదలుపెట్టింది. అయితే ఆరంభమైన 15 నిమిషాల్లోనే నౌకలో సాంకేతిక సమస్య తలెత్తి, అది సముద్రంలో మునిగిపోవడం మొదలైంది.
ఆకస్మిక పరిణామాలతో భయాందోళనకు గురైన ప్రయాణికులు, సిబ్బంది వెంటనే సముద్రంలోకి దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. అదృష్టవశాత్తూ అందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. నౌక మునిగిపోతున్న దృశ్యాలను చూసిన యజమాని, కెప్టెన్ కూడా తీవ్ర నిరుత్సాహానికి గురై చివరికి సముద్రంలోకి దూకి బయటపడ్డాడు.
ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ, మునిగిపోవడానికి గల కారణాలను తెలుసుకోవడానికి విచారణ చేపడతామని తెలిపారు. సాంకేతిక లోపమేనా లేదా డిజైన్‌లో సమస్య ఉందా అనేది త్వరలో తేలనుంది. అంతలోనే, నౌక మునిగిపోతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ, నెటిజన్లు విస్తృతంగా స్పందిస్తున్నారు.