ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీని ఒక ఫేక్ పార్టీగా అభివర్ణించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు చూసినా.. ఇంత దిగజారిపోయిన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు. నేరాలకే అండగా నిలిచే వైసీపీ ఎప్పటికప్పుడు విషప్రచారం చేస్తూనే ఉందని ఆరోపించారు. అందుకే ఆ పార్టీని తాను విషవృక్షం అని పిలుస్తున్నానని స్పష్టం చేశారు.
రైతుల అంశంపైనా సీఎం స్పందించారు. ఈ ఏడాది పంటల కోసం ఎరువుల వినియోగాన్ని కాస్త తగ్గించి.. సుమారు 33 లక్షల మెట్రిక్ టన్నుల వరకు పరిమితం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం టార్గెట్ ఫిక్స్ చేసి.. ప్రతి జిల్లాలో అవసరమైన ఎరువులు అందిస్తోందన్నారు. ప్రస్తుతం 94,892 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. ఇందులో మార్క్‌ఫెడ్ వద్ద 81,750 మెట్రిక్ టన్నులు ఉన్నాయని వివరించారు.
నెల్లూరు జిల్లా రైతులు ఈ ఏడాది ఎక్కువ యూరియా వాడారని సీఎం వెల్లడించారు. రెండు పంటలు వేయడం వల్ల అక్కడ వినియోగం అధికమైందని చెప్పారు. రైతుల అవసరాలు తీర్చేందుకు అన్ని జిల్లాల్లో సమయానికి యూరియా సరఫరా చేస్తున్నామని ఆయన భరోసా ఇచ్చారు.