తెలంగాణ రాష్ట్రంలో రేపు రేషన్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ రేషన్ డీలర్లు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో రేపటినుంచి రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో లక్షలాది రేషన్ కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఎన్నికల ముందు రేషన్ డీలర్లకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం, కమీషన్ పెంపు వంటి హామీలు ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చి 21 నెలలు గడిచినా వాటిని అమలు చేయలేదని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం తీవ్రంగా విమర్శించింది. అంతేకాకుండా తమ కుటుంబాలకు హెల్త్ కార్డులు మంజూరు చేయడం, రేషన్ దుకాణాల అద్దె, బియ్యం దిగుమతి ఛార్జీలు ప్రభుత్వం భరించాలనే డిమాండ్‌తో వస్తున్నామని వారు స్పష్టం చేశారు. గత ఐదు నెలలుగా కమీషన్ బకాయిలు, గన్నీ బ్యాగుల బిల్లులు చెల్లించకపోవడంపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు బత్తుల రమేశ్ బాబు మాట్లాడుతూ— "మా సమస్యల పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రేపటి ఒకరోజు బంద్‌తోనైనా స్పందించకపోతే, నిరవధికంగా బియ్యం పంపిణీ నిలిపివేయాల్సి వస్తుంది" అని హెచ్చరించారు. అలాగే పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే సచివాలయాన్ని ముట్టడించేందుకు కూడా సిద్ధమవుతున్నామని స్పష్టం చేశారు. డీలర్ల హెచ్చరికలతో రేపటి బంద్ రాష్ట్రంలో పెద్ద దుమారమే రేపనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.