భారతదేశ పన్ను వ్యవస్థలో పెద్ద సంస్కరణలలో ఒకటైన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) ఇప్పుడు మరింత సరళీకృతం కానుంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 5% మరియు 18% శ్లాబులే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న 12% మరియు 28% స్లాబులు తొలగించబడ్డాయి.
ఈ మార్పులు ఈ నెల 22వ తేదీ నుంచే అమల్లోకి రానున్నాయి. మొదట దీపావళి నుంచి ప్రారంభించాలన్న కేంద్ర ఆర్థికశాఖ ఆలోచన ఉన్నా, సాంకేతిక కారణాలు, వ్యాపారులకు సౌలభ్యం కల్పించడం దృష్ట్యా ముందుగానే అమలు చేయాలని నిర్ణయించారు.
జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ కీలక నిర్ణయాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా మీడియా ముందు వివరించనున్నారు. వ్యాపారులు, వినియోగదారులందరికీ సులభతరం అయ్యేలా పన్ను వ్యవస్థను తీసుకువెళ్తున్నామని ఆమె చెప్పే అవకాశముంది.
ఇప్పటి వరకు కొంతమంది ఉత్పత్తులు 12%లో, లగ్జరీ వస్తువులు, కొన్ని హానికర ఉత్పత్తులు 28%లో ఉండేవి. ఈ శ్లాబులు తొలగిపోవడంతో:
వినియోగదారులకు గందరగోళం తగ్గుతుంది
వ్యాపారులకు అకౌంటింగ్ సులభమవుతుంది
GST రిటర్నులు సింపుల్ అవుతాయి పన్ను ఎగవేతకు అవకాశాలు తగ్గుతాయి.
కొత్త నిర్ణయంపై వ్యాపార వర్గాలు మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చెేస్తూ ఉన్నారు. “ఇకపై రేట్లు కన్‌ఫ్యూజ్ కాకుండా రెండు శ్లాబులే ఉండడం సౌకర్యం” అంటున్న వారు ఉన్నారు. అయితే 28%లో ఉన్న కొన్ని లగ్జరీ వస్తువులు 18%కు వస్తే ప్రభుత్వానికి రెవెన్యూ నష్టం కలుగుతుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఈ మార్పులతో సాధారణ వినియోగదారులకు కొంత ఊరట దక్కే అవకాశం ఉంది. 28% స్లాబులో ఉన్న గూడ్స్ 18%కు వస్తే ధరలు తగ్గుతాయి. అయితే 12%లో ఉన్న కొన్ని ఉత్పత్తులు 18%కు మారితే ధరలు పెరిగే అవకాశం ఉంది. అంటే కొన్నింటికి లాభం, మరికొన్నింటికి భారం పడే పరిస్థితి ఉంటుంది.
ఆర్థిక నిపుణులు చెబుతున్నట్టుగా, “GST వ్యవస్థను సింపుల్ చేయాలన్నది మొదటి నుంచే కేంద్రం ఉద్దేశ్యం. 4 స్లాబుల నుంచి 2కి తగ్గించడం పెద్ద అడుగు. కానీ దీని ఫలితాలు పూర్తిగా అంచనా వేయడానికి కొంత సమయం పడుతుంది” అని అంటున్నారు.
ఈ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు కూడా స్పందించే అవకాశం ఉంది. “ప్రజలపై పన్నుల భారం తగ్గించడమే నిజమైన లక్ష్యం కావాలి” అంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరిగానే ఉందా అనే చర్చ రాబోయే రోజుల్లో వేడెక్కనుంది. మొత్తానికి, GSTలో ఇకపై 5% మరియు 18% శ్లాబులే ఉండడం పన్ను వ్యవస్థలో పెద్ద సంస్కరణ. సాధారణ ప్రజల జీవన విధానంపై, వ్యాపారాలపై దీని ప్రభావం ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో వచ్చే నెలల్లో స్పష్టమవుతుంది.