ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు కీలక సమాచారం. బాపట్ల జిల్లా రేపల్లె నుంచి సికింద్రాబాద్, వికారాబాద్ మార్గంలో నడుస్తున్న డెల్టా ఎక్స్‌ప్రెస్ (17626) రైలు టైమింగ్స్‌లో రైల్వే శాఖ మార్పులు చేసింది. ఈ మార్పులు నవంబర్ 4 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు రేపల్లె నుంచి రాత్రి 10.40 గంటలకు బయల్దేరే రైలు, సికింద్రాబాద్‌కు మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు చేరుకునేది. కానీ ఇకపై ఈ రైలు 45 నిమిషాలు ముందుగానే, అంటే ఉదయం 6.35 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు.
అదేవిధంగా, ప్రస్తుతం వికారాబాద్ స్టేషన్‌కు ఉదయం 9.40కి చేరుకునే ఈ రైలు, నవంబర్ 4 నుంచి 20 నిమిషాల ముందే అంటే 9.20 గంటలకు చేరుకోనుంది. ఈ నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రేపల్లె–హైదరాబాద్ రూట్‌లో ప్రయాణించే వారికి సమయం ఆదా అవుతుందని భావిస్తున్నారు. ఈ మార్పుల దృష్ట్యా మధ్యలోని స్టేషన్ల టైమింగ్స్‌లో కూడా సవరణలు జరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. త్వరలో పూర్తి వివరాలను విడుదల చేయనున్నారు.
డెల్టా ఎక్స్‌ప్రెస్ ఏపీలోని రేపల్లె, పల్లికోన, భట్టిప్రోలు, వేమూరు, చిన్నరావూరు, తెనాలి, వేజెండ్ల, గుంటూరు స్టేషన్లలో ఆగుతుంది. అలాగే తెలంగాణలోని ఘట్కేసర్, చర్లపల్లి, మౌలాలి, సికింద్రాబాద్, బేగంపేట, సనత్‌నగర్, హఫీజ్‌పేట, లింగంపల్లి, నాగలపల్లి, శంకరపల్లి, గుళ్లగూడ, చిట్‌గిడ్డ, వికారాబాద్ స్టేషన్లలో ఆగనుంది. ప్రయాణికులు కొత్త టైమింగ్స్‌ను గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.