ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగిన ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని పారిశుద్ధ్య కార్మికులకు ప్రమాద బీమా వర్తింపజేస్తూ, ఒక్కో శాశ్వత ఉద్యోగికి రూ.కోటి, కాంట్రాక్ట్ కార్మికుడికి రూ.20 లక్షల వరకు లబ్ధి అందేలా చర్యలు చేపట్టారు. ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం యాక్సిస్ బ్యాంక్‌తో కలిసి అమలు చేయనుంది.
ఈ బీమా పథకంలో శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం వేర్వేరు ప్రయోజనాలు ఉండనున్నాయి. శాశ్వత ఉద్యోగికి పూర్తి స్థాయి ప్రమాదం లేదా శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.కోటి వరకూ లబ్ధి అందుతుంది. ఔట్‌సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగికి శాశ్వత వైకల్యం వస్తే రూ.20 లక్షలు, పాక్షిక అంగవైకల్యం వస్తే 75 శాతం బీమా మొత్తాన్ని ఇవ్వనున్నారు. అదనంగా, కాంప్లిమెంటరీ ఎడ్యుకేషన్ గ్రాంట్ కింద ఎనిమిది లక్షల వరకు సహాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ పథకం రాష్ట్రంలోని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న 55,686 మంది పారిశుద్ధ్య కార్మికులకు వర్తిస్తుంది. దీనికి సంబంధించిన బీమా పాలసీ పత్రాలను సీఎం స్వయంగా పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పెద్దాపురంలోని కుమ్మరవీధి దొరయ్యపేటలో ఏర్పాటు చేసిన మ్యాజిక్ డ్రెయిన్‌ను పరిశీలించారు. అదేవిధంగా స్థానిక ప్రజలను కలసి వారి సమస్యలు తెలుసుకున్నారు.
ప్రజలతో కలిసిన సమయంలో సీఎం చిన్నారులు, మహిళలతో మాట్లాడి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ముగ్గురు విద్యార్థులు ఆయన ఆటోగ్రాఫ్ కోరగా, వారి చొక్కాలపై సంతకాలు చేశారు. మహిళలతో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆయన హితవు పలికారు.
సభలో మాట్లాడుతూ, సీఎం చెత్తను సంపదగా మలచే సర్క్యులర్ ఎకానమీ పాలసీని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం అమలు చేస్తున్నామని, ఈ-వ్యర్థాలను రీసైక్లింగ్ ద్వారా ఉపయోగకరంగా మార్చుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసినా, తమ ప్రభుత్వం మాత్రం ఇళ్ల వద్దకే చెత్త వాహనాలు పంపించి ప్లాస్టిక్, ఈ-వేస్ట్ సేకరించి ప్రజలకు డబ్బులు ఇస్తోందని తెలిపారు. అక్టోబర్ 2 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను చెత్త రహిత రాష్ట్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు.