ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ హెచ్చరిక జారీ అయింది. రేపు ఆదివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేయబడింది. మిగతా జిల్లాల్లో కూడా ఒకటి, రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఆగస్టు 25వ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరిన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే వర్షాల తాకిడి కొంత తగ్గినప్పటికీ, కొత్త అల్పపీడనం వల్ల పరిస్థితులు మళ్లీ మారవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు వర్షాలు తగ్గుతుండడంతో నదుల వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. కృష్ణా, గోదావరి నదుల్లో నీటి మట్టం కొద్దికొద్దిగా తగ్గుతుందని APSDMA తెలిపింది. కాటన్ బ్యారేజి వద్ద ఇన్-ఫ్లో, ఔట్-ఫ్లో సుమారు 9.57 లక్షల క్యూసెక్కులుగా నమోదైందని, మొదటి ప్రమాద హెచ్చరికను ఇప్పటికే ఉపసంహరించామని అధికారులు వెల్లడించారు. అలాగే కృష్ణా నదిలో వరద నిలకడగా ఉందని, ప్రకాశం బ్యారేజి వద్ద కూడా హెచ్చరికను ఎత్తివేశామని తెలిపారు.
ఈ సమయంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వరద పూర్తిగా తగ్గేవరకు లోతట్టు గ్రామాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. వర్షాల కారణంగా కలుషిత నీరు త్రాగితే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రజలు నీటిని కాచి త్రాగడం, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండనివ్వకపోవడం, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఉండకపోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. వర్షాల్లో వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని, నీరు నిలిచిన రోడ్లపై ప్రయాణం నివారించాలనిచెప్పారు. మొత్తం మీద రాబోయే కొన్ని రోజులు వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.