ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు శుక్రవారం అధికారికంగా ముగిశాయి. విద్య, ఉద్యోగ నియామకాలు, వ్యవసాయం, ఆర్థిక రంగం, సామాజిక సంస్కరణ వంటి కీలక అంశాలకు సంబంధించిన ఆరు ప్రధాన బిల్లులు సభ ఆమోదం పొందాయి. అన్ని బిల్లులకు అనుకూలంగా ముద్ర పడిన తర్వాత, ఛైర్మన్ మోషేన్ రాజు మండలిని నిరవధికంగా వాయిదా వేశారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి దిశానిర్ధేశం చేయనున్నాయని భావిస్తున్నారు.
రాష్ట్రంలో విద్యను అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన వసతులు కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం పలు బిల్లులను ప్రవేశపెట్టింది. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. ఇది రాష్ట్రానికి కొత్త విద్యా అవకాశాలను తెచ్చిపెట్టనుంది. అలాగే ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం, ఏపీ వర్సిటీల సవరణ బిల్లులకు సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మార్పులతో ప్రైవేటు విద్యాసంస్థల పర్యవేక్షణ మరింత కఠినతరం కానుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు, తల్లిదండ్రులపై అనవసర భారం పడకుండా ఉండేందుకు ఈ చట్టాలు దోహదం చేస్తాయని ప్రభుత్వం తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, వేతనాల చెల్లింపులో పారదర్శకత పెంచడం కోసం ప్రవేశపెట్టిన బిల్లు కూడా సభ ఆమోదం పొందింది. ఈ చట్టం ద్వారా నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే క్రమంలో క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వడానికి ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయి మైనేనిని డిప్యూటీ కలెక్టర్‌గా నియమించే ప్రతిపాదనకు మండలి అంగీకరించింది. ఈ నిర్ణయం క్రీడాకారులకు ప్రేరణనిచ్చేలా ఉండటమే కాకుండా, ప్రతిభావంతులైన వ్యక్తులు ప్రభుత్వ వ్యవస్థలో భాగస్వాములు కావడానికి మార్గం సుగమం చేస్తుందని పేర్కొంది.
వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు మార్చే ప్రక్రియను సరళతరం చేసే బిల్లుకు కూడా ఆమోదం లభించింది. రైతులు, పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్కువయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా, ఏపీ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సవరణ బిల్లు-2025 సభ ఆమోదం పొందింది. పన్ను విధానాల్లో మార్పులు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదం చేయనున్నాయి. మరోవైపు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చట్టాల నుంచి ‘కుష్టువ్యాధి’ అనే పదాన్ని తొలగించే సవరణ బిల్లును మండలి ఆమోదించింది. ఇది సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించే దిశగా ముందడుగుగా భావిస్తున్నారు. మొత్తానికి, ఈ కీలక బిల్లుల ఆమోదం ద్వారా రాష్ట్రం విద్య, ఉద్యోగాలు, వ్యవసాయం, ఆర్థిక రంగాల్లో కొత్త మార్గాలను అన్వేషించే అవకాశాలు దొరికాయి.