ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక చారిత్రక అధ్యాయం ప్రారంభం కానుందని, టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14న కీలక ఒప్పందం కుదుర్చుకోనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
ఇది తన రాజకీయ జీవితంలోనే ఒక అపూర్వ ఘట్టమని ఆయన అభివర్ణించారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలోకి గూగుల్ సంస్థ భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకురానుందని, దీని ఫలితంగా విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద డేటా హబ్‌గా రూపాంతరం చెందనుందని తెలిపారు.
అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతిన్నదని, ఇప్పుడు దానిని పునర్నిర్మించి పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తున్నామని అన్నారు.
ఒకవైపు డేటా సెంటర్, మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్యం అందించేలా కరిక్యులమ్‌ను తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు వివరించారు.
రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా కొందరు అడ్డుకోవడం, బెదిరింపులకు పాల్పడటం ఒక ఫ్యాషన్‌గా మారిందని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు నవంబర్‌లో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షిస్తూనే, మరోవైపు ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపుతామని చంద్రబాబు హెచ్చరించారు. ఈ సందర్భంగా కల్తీ, నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు రూపొందించిన 'ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్'ను ఆయన ఆవిష్కరించారు.
ఈ యాప్ ద్వారా వినియోగదారులు మద్యం బాటిల్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, దాని తయారీ తేదీ, సమయం, బ్యాచ్ నెంబర్ వంటి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. మద్యం బాటిళ్లకు, దుకాణాలకు జియో ట్యాగింగ్, జియో ఫెన్సింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని, దీనివల్ల బెల్ట్ షాపులకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని వివరించారు. మద్యం సంబంధిత ఫిర్యాదుల కోసం 14405 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశామని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం ఏరులై పారిందని, జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోతే కనీసం విచారణ కూడా జరపలేదని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. సొంత మనుషులకు చెందిన బ్రాండ్లతో మొత్తం వ్యవస్థను నాశనం చేసిన వారు, ఇప్పుడు తమ ప్రభుత్వంపై బురద జల్లేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
అనారోగ్యంతో చనిపోయిన వారిని కూడా కల్తీ మద్యం మృతులుగా చిత్రీకరిస్తూ శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. "వాళ్లే నేరాలు చేస్తారు, ప్రభుత్వానికి అంటగడతారు, అలజడి సృష్టించి సీబీఐ విచారణ కావాలంటారు. వివేకా హత్య కేసులో ఏం జరిగిందో అందరూ చూశారు.
ఇలాంటి కుట్రలను, శవ రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం," అని ఆయన హెచ్చరించారు. తప్పు చేసిన వారు అధికారులు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని, అదే సమయంలో ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేసే వారిని కూడా వదిలిపెట్టబోమని చంద్రబాబు స్పష్టం చేశారు.