ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. భారత సైన్యం దాడుల భయంతో పాకిస్థాన్ నౌకాదళం తమ ప్రధాన స్థావరం కరాచీ నుంచి యుద్ధనౌకలను తరలించినట్లు శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి.
మే 8న కరాచీ పోర్టు దాదాపు ఖాళీగా ఉండగా, రెండు రోజుల తర్వాత మే 10న కరాచీకి 100 కిలోమీటర్ల దూరంలో గ్వాదర్ పోర్టులో ఏకంగా ఏడు పాక్ యుద్ధనౌకలు నిలిపివేసిన దృశ్యాలు బహిర్గతమయ్యాయి. మరికొన్ని నౌకలను వాణిజ్య టెర్మినల్స్, ఇరాన్ సరిహద్దు సమీప జలాల్లో దాచినట్లు సమాచారం.
అందులో చైనా నుంచి కేవలం ఆరు నెలల క్రితమే తెచ్చుకున్న నాలుగు శక్తివంతమైన ‘జుల్ఫికర్’ ఫ్రిగేట్లు కూడా ఉన్నాయి. వీటిని పాక్ నేవీ మిసైల్ ట్రయల్స్ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. కానీ ఇప్పుడు భారత దాడి భయంతోనే వాటిని కరాచీ నుంచి తరలించడమే గమనార్హం.
ఈ పరిణామం 1971 యుద్ధం జ్ఞాపకాలను రేకెత్తిస్తోంది. అప్పట్లో భారత నేవీ ‘ఆపరేషన్ పైథాన్’ పేరిట కరాచీ ఓడరేవుపై దాడి చేసి పాక్ నౌకలు, చమురు నిల్వ కేంద్రాలను ధ్వంసం చేసింది. మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదనే భయంతోనే ఈ చర్యలు తీసుకున్నారని నిపుణులు అంటున్నారు.
ఇక పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. "దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పిస్తాం" అని ఆయన చెప్పినా, మే 10న నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌పై దాడి జరుగుతుండగా రహస్య బంకర్‌లో దాక్కున్నారని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.