సాక్షాత్తు వైకుంఠవాసుడే గరుత్మంతుడిపై ఆసీనుడై భక్తులకు దర్శనం ఇచ్చే రోజు వచ్చింది. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ నేడే (సెప్టెంబర్ 28) సాయంత్రం 6:30 గంటల నుంచి అత్యంత వైభవంగా జరగనుంది. గరుడ సేవను కనులారా దర్శిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ఈ సేవకు లక్షలాదిగా భక్తులు తిరుమలకు తరలివస్తారు.
ఈ భారీ రద్దీ దృష్ట్యా, భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరియు పోలీస్ శాఖ సంయుక్తంగా తిరుపతి, తిరుమల ఘాట్ రోడ్లలో ప్రత్యేక ఏర్పాట్లు, ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నాయి.
గరుడ సేవ సందర్భంగా భక్తుల రద్దీని, భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ మరియు పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
ద్విచక్ర వాహనాలకు నిషేధం: సెప్టెంబర్ 27, 2025 రాత్రి 9:00 గంటల నుండి సెప్టెంబర్ 29, 2025 ఉదయం 6:00 గంటల వరకు ఘాట్ రోడ్లలోకి ద్విచక్ర వాహనాలను (Two-wheelers) అనుమతించరు. టూ వీలర్లపై తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని తప్పక గమనించాలి.
ప్రయాణానికి బస్సే బెటర్: భక్తుల సౌకర్యార్థం తిరుపతి నుంచి తిరుమల వరకు ఏపీఎస్‌ఆర్టీసీతో పాటు టీటీడీ ప్రత్యేక బస్సులు నిరంతరాయంగా నడుపుతున్నాయి. భక్తులు ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ ప్రత్యేక బస్సుల్లోనే ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.
తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గారు మాట్లాడుతూ, భక్తుల రద్దీ అధికంగా ఉండటం వల్ల తిరుపతి నగరంలో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు కూడా అమల్లోకి వస్తాయని తెలిపారు. అందరూ పోలీసులకు, టీటీడీ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తిరుపతిలో పార్కింగ్, ట్రాఫిక్ డైవర్షన్లు ఇలా..
గరుడ సేవ రోజున ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, తిరుపతి నగరంలో పార్కింగ్ కోసం పలు చోట్ల భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులు తమ వాహనాలను ఎక్కడ పడితే అక్కడ కాకుండా, కేటాయించిన చోట్ల మాత్రమే పార్క్ చేయాలి.
ప్రధాన పార్కింగ్ ప్రదేశాలు:
గమనిక: భక్తులందరూ కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల కోసం QR కోడ్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ పార్కింగ్ ప్రాంతాలలో టీటీడీ ద్వారా త్రాగునీరు, భోజనం, టాయిలెట్స్, 24/7 బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు.
ఆర్టీసీ బస్సుల మళ్లింపు: చిత్తూరు, మదనపల్లి వైపు నుండి తిరుపతి లోపలికి వచ్చే ఆర్టీసీ బస్సులు ఇకపై కాలూరు క్రాస్, ఆర్.సీ.పురం, తనపల్లి – గరుడ ఫ్లై ఓవర్ మీదుగా బస్ స్టాండ్‌కు మళ్లించబడతాయి.
తిరుమలలో పార్కింగ్ ఏర్పాట్లు:
తిరుమల కొండపైనా పార్కింగ్ ఏర్పాట్లలో మార్పులు చేశారు.
రాంభగీచ పార్కింగ్: వీవీఐపీ (VVIP) పెద్ద బ్యాడ్జెస్ వాహనాలకు కేటాయించారు.
సప్తగిరి గెస్ట్ హౌస్ పార్కింగ్: వీఐపీ (VIP) చిన్న బ్యాడ్జెస్ వాహనాలకు కేటాయించారు.
సాధారణ వాహనాలు: ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలకు పార్క్ చేసుకోవాలి.
భక్తులందరూ పోలీసుల, టీటీడీ సిబ్బంది సూచనలను పాటించి, ఈ పవిత్రమైన గరుడ సేవను ప్రశాంతంగా దర్శించుకోవాలని కోరారు.