మలయాళ సినీ ప్రపంచానికి గర్వకారణమైన సూపర్ స్టార్ మోహన్లాల్ మరోసారి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఆయనకు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్వయంగా “COAS (Chief of Army Staff) కమెండేషన్ కార్డ్”ను అందజేశారు. ఇది సాధారణ అవార్డు కాదు దేశ సేవలో విశేష కృషి చేసిన లేదా సైనిక విలువలను సమాజంలో ప్రోత్సహించిన వ్యక్తులకు మాత్రమే ఈ గుర్తింపు ఇస్తారు.
ఈ అవార్డు స్వీకరించిన అనంతరం మోహన్లాల్ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. ఆయన ఇలా పేర్కొన్నారు హానరరీ లెఫ్టినెంట్ కల్నల్గా గుర్తింపు పొందడం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది గారికి, అలాగే నా మాతృసంస్థ అయిన టెరిటోరియల్ ఆర్మీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గౌరవం నా జీవితంలో మరపురాని క్షణంగా నిలుస్తుంది, అని ట్వీట్ చేశారు.

మోహన్లాల్ గతంలోనే ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో హానరరీ లెఫ్టినెంట్ కల్నల్గా నియమితులయ్యారు. ఆయన దేశభక్తిని, దేశ సేవ పట్ల ఉన్న అంకితభావాన్ని గుర్తిస్తూ అప్పట్లో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఈ గౌరవం ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన దేశ భద్రత, సైనిక సేవల పట్ల గౌరవాన్ని పదేపదే ప్రదర్శిస్తూ వస్తున్నారు.
మోహన్లాల్ నటుడిగానే కాదు, నిజ జీవితంలోనూ క్రమశిక్షణ, సమర్పణ, దేశప్రేమకు ప్రతీకగా నిలుస్తున్నారు. ఆయన నటించిన ‘కురుతిపుణల్, కలపాని, కీర్తిచక్ర’ వంటి సినిమాలు భారత సైన్య జీవితాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా “కీర్తిచక్ర” సినిమాలో ఆర్మీ మేజర్ మహాదేవన్‌గా చేసిన నటన ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఆ పాత్ర తర్వాతే ఆయనకు సైన్యం నుంచి ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
తాజాగా అందుకున్న COAS కమెండేషన్ కార్డ్ మోహన్లాల్ వ్యక్తిత్వాన్ని మరోసారి ప్రతిష్ఠాత్మక స్థాయికి తీసుకెళ్లింది. ఈ గౌరవం భారత సైన్యంలో కూడా అరుదైనదే. సాధారణంగా ఈ అవార్డు సైనికులకు లేదా సైనిక విధుల్లో విశేష కృషి చేసిన వారికి మాత్రమే ఇస్తారు. అయితే, సమాజంలో ఆర్మీ విలువలను ప్రచారం చేసే లేదా దేశ సేవ పట్ల చైతన్యం కలిగించే వ్యక్తులకూ ఇది ప్రదానం చేస్తారు.
మోహన్లాల్ ఈ గౌరవం పొందిన తరువాత మలయాళ సినీ పరిశ్రమ అంతా హర్షం వ్యక్తం చేసింది. ప్రముఖ నటులు, దర్శకులు, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తించారు. “మోహన్లాల్ గర్వం మన గర్వం, “సినిమా మాత్రమే కాదు, దేశభక్తి అంటే ఇదే, మేజర్ మహాదేవన్ ఇప్పుడు నిజమైన మేజర్ అయ్యాడు” అంటూ ట్వీట్లు, కామెంట్లు కురిపించారు.
ఇటీవలే మోహన్లాల్ తన అసాధారణ సినీ ప్రస్థానానికి గాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు. దీంతో ఆయన పేరు వరుసగా రెండు గౌరవాల ద్వారా జాతీయ స్థాయిలో ప్రతిధ్వనించింది. తన అద్భుత నటన, సాదాసీదా జీవన విధానం, మరియు దేశానికి అంకితమైన మనసుతో ఆయన కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.
భారత సైన్యం గౌరవం, దేశ గర్వం, సినీ ప్రపంచం ప్రతిభ ఈ మూడింటినీ మోహన్లాల్ సమన్వయం చేసిన అరుదైన వ్యక్తిగా నిలిచారు. నిజంగానే, ఆయనకు దక్కిన COAS కమెండేషన్ కార్డ్ మలయాళ ఇండస్ట్రీకే కాదు, మొత్తం భారతదేశానికి గర్వకారణం.