RBI: ₹10, ₹20 పాలిమర్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. అసలు ఈ నోట్ల ప్రత్యేకత ఏమిటి?
RBI: భారతీయ కరెన్సీ వ్యవస్థలో మరో కీలక మార్పుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ₹10, ₹20 విలువ కలిగిన పాలిమర్ బ్యాంకు నోట్లను ప్రయోగాత్మకంగా ముద్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రతి విలువలో 100 కోట్ల (1 బిలియన్) నోట్లు ఫీల్డ్ ట్రయల్స్ కోసం ముద్రించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతమైతే రెగ్యులర్‌గా చలామణిలోకి కొత్త నోట్లు..
కాగితపు నోట్లను పూర్తిగా తొలగించే ఆలోచన లేదన్న కేంద్ర ప్రభుత్వం..
న్యూఢిల్లీ: భారతీయ కరెన్సీ వ్యవస్థలో మరో కీలక మార్పుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ₹10, ₹20 విలువ కలిగిన పాలిమర్ బ్యాంకు నోట్లను ప్రయోగాత్మకంగా ముద్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రతి విలువలో 100 కోట్ల (1 బిలియన్) నోట్లు ఫీల్డ్ ట్రయల్స్ కోసం ముద్రించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతమైతే, ఈ రెండు విలువల పాలిమర్ నోట్లను దేశవ్యాప్తంగా క్రమం తప్పకుండా విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం–1934లోని సెక్షన్ 25 ప్రకారం, ఆర్‌బీఐ కేంద్ర బోర్డు సిఫార్సుతో పాలిమర్ నోట్ల ముద్రణకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఇందులో ₹10, ₹20 విలువలలో ఒక్కోటి 100 కోట్ల పాలిమర్ నోట్లు ప్రయోగాత్మకంగా ముద్రించడం, ఆ తర్వాత ఫలితాలను పరిశీలించి సాధారణ చలామణిలోకి తీసుకురావడం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది.
పాలిమర్ నోట్లు విడుదల చేసినప్పటికీ, ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లు కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పాలిమర్ నోట్లతో కాగితపు కరెన్సీని పూర్తిగా భర్తీ చేసే ఆలోచన ప్రస్తుతం లేదని మంత్రి పంకజ్ చౌధరి వెల్లడించారు. రెండు రకాల నోట్లు ఒకేసారి చలామణిలో ఉంటాయని తెలిపారు.
అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం, పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్ల కంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. ఇవి త్వరగా చిరిగిపోవు, తేమ, మురికి ప్రభావానికి తక్కువగా లోనవుతాయి. దీంతో నోట్ల జీవితకాలం పెరగడంతో పాటు, తరచుగా కొత్త నోట్లు ముద్రించాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. ఈ కారణంగానే ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే పాలిమర్ కరెన్సీని విజయవంతంగా వినియోగిస్తున్నాయి.
ఆర్‌బీఐ తాజా వార్షిక నివేదిక ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో కాగితపు కరెన్సీ ముద్రణ కోసం ₹6,372.8 కోట్లు ఖర్చు చేసింది. అంతకుముందు 2023-24లో ఈ వ్యయం ₹5,101.4 కోట్లు మాత్రమే ఉంది. దేశంలో కరెన్సీ డిమాండ్ పెరగడం వల్ల ముద్రించాల్సిన నోట్ల సంఖ్య కూడా పెరిగిందని ఆర్‌బీఐ తెలిపింది. పాలిమర్ నోట్ల ప్రవేశంతో డిజిటల్ చెల్లింపులపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయాన్ని ప్రస్తుతం చెప్పడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
ఫీల్డ్ ట్రయల్స్ పూర్తై, సాధారణంగా నోట్లు చలామణిలోకి వచ్చిన తర్వాత మాత్రమే దాని ప్రభావాన్ని అంచనా వేయవచ్చని తెలిపింది. అలాగే నగదు చెల్లింపులు, డిజిటల్ చెల్లింపులు రెండూ ప్రజలకు పరస్పర అనుబంధ చెల్లింపు విధానాలేనని, ఒకదానికి బదులుగా మరొకటి కాదని స్పష్టం చేసింది.
భారత్‌లో పాలిమర్ నోట్ల ఆలోచన కొత్తది కాదు. 2012లో కూడా నోట్ల జీవితకాలాన్ని పెంచేందుకు పాలిమర్ కరెన్సీ ప్రవేశపెట్టే ప్రయత్నం జరిగింది. అయితే అప్పటి సాంకేతిక పరిమితుల కారణంగా ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఆర్‌బీఐ మరోసారి ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 దేశాలు పాలిమర్ బ్యాంకు నోట్లను వినియోగిస్తున్నాయి. 1988లో ఆస్ట్రేలియా తొలిసారిగా 10 డాలర్ల పాలిమర్ నోటును ప్రవేశపెట్టింది. అనంతరం సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, కెనడా, రొమేనియా వంటి అనేక దేశాలు కూడా పాలిమర్ కరెన్సీని చలామణిలోకి తీసుకొచ్చాయి.
ప్రస్తుతం ఈ నిర్ణయం ప్రయోగాత్మక దశలోనే ఉంది. ఫీల్డ్ ట్రయల్స్ ద్వారా నోట్ల మన్నిక, వినియోగ సౌలభ్యం, భద్రత, ప్రజల స్పందన వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే దేశవ్యాప్తంగా పాలిమర్ నోట్లను రెగ్యులర్‌గా విడుదల చేయాలా లేదా అన్న దానిపై ఆర్‌బీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. కొత్త సాంకేతికతతో మరింత మన్నికైన కరెన్సీని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం, ఆర్‌బీఐ కలిసి ఈ కీలక అడుగు వేస్తున్నాయి.
Be the first to react
