⚡ BREAKING

Parliament: పేపర్ లీక్‌లపై ఉక్కుపాదం.. నేడు లోక్‌సభ ముందుకు పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు!

Parliament: దేశవ్యాప్తంగా పబ్లిక్ పరీక్షల్లో జరుగుతున్న పేపర్ లీకేజీలు, సంఘటిత అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. పరీక్షల వ్యవస్థలో పారదర్శకతను పెంచడం, విద్యార్థుల భవిష్యత్తును కాపాడడం లక్ష్యంగా రూపొందించిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభ ముందుకు తీసుకురానున్నారు.

Parliament
Parliament

పేపర్ లీక్‌లపై కేంద్రం ఉక్కుపాదం.. కఠిన సవరణలకు శ్రీకారం..

పరీక్షల అక్రమాలకు చెక్.. 10 ఏళ్ల జైలు, భారీ జరిమానాలకు ప్రతిపాదన..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పబ్లిక్ పరీక్షల్లో జరుగుతున్న పేపర్ లీకేజీలు, సంఘటిత అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. పరీక్షల వ్యవస్థలో పారదర్శకతను పెంచడం, విద్యార్థుల భవిష్యత్తును కాపాడడం లక్ష్యంగా రూపొందించిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభ ముందుకు తీసుకురానున్నారు.

ఇటీవలి కాలంలో పలు జాతీయ స్థాయి పరీక్షల్లో పేపర్ లీకేజీలు, సంఘటిత మోసాలు వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కఠిన చర్యలు చేపడుతోంది. ఇప్పుడు ఆ చర్యలకు మరింత బలం చేకూర్చేలా ఈ సవరణ బిల్లులో పలు కీలక నిబంధనలను చేర్చింది.

బిల్లులోని ప్రతిపాదనల ప్రకారం, పరీక్షల్లో సాధారణ అక్రమాలకు పాల్పడిన వారిపై 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అలాగే రూ.50 లక్షల వరకు జరిమానా కూడా విధించే నిబంధనను ప్రతిపాదించారు.

పేపర్ లీక్‌లకు పాల్పడే సంఘటిత ముఠాలు, పరీక్షల మాఫియాపై మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి గ్యాంగ్‌లపై రూ.10 కోట్ల వరకు భారీ జరిమానా విధించేలా బిల్లులో నిబంధనలు చేర్చారు.

పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం లేదా అక్రమాలకు సహకరించిన సర్వీస్ ప్రొవైడర్లపై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నారు. వారికి రూ.5 కోట్ల వరకు జరిమానా విధించడంతో పాటు ఎనిమిదేళ్లపాటు బ్లాక్‌లిస్ట్ చేసే అవకాశం కల్పించారు. దీంతో పరీక్షల నిర్వహణలో బాధ్యత, పారదర్శకత మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

పేపర్ లీక్ కేసుల విచారణ సంవత్సరాల తరబడి సాగకుండా ఉండేందుకు బిల్లులో ప్రత్యేక నిబంధనలు చేర్చారు. కేసు నమోదు అయిన రెండు నెలల్లోపే దర్యాప్తు పూర్తి చేయాలి. అనంతరం ఛార్జిషీట్ దాఖలైన మూడు నెలల్లోనే విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ లక్ష్యంతో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి కేసులను వేగంగా పరిష్కరించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.

పేపర్ లీక్ కేసులకు సంబంధించిన అప్పీళ్లను కూడా త్వరగా పరిష్కరించేందుకు బిల్లులో స్పష్టమైన నిబంధనలు చేర్చారు. అప్పీళ్లను హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక బెంచ్ మాత్రమే విచారించనుంది. అలాంటి అప్పీళ్లను మూడు నెలల్లోపు తప్పనిసరిగా పరిష్కరించాలని బిల్లులో పేర్కొన్నారు.

పబ్లిక్ పరీక్షలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంపొందించడం, ప్రతిభకు తగిన గుర్తింపు కల్పించడం, పేపర్ లీక్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవడం ఈ సవరణ బిల్లు ప్రధాన ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చ అనంతరం ఆమోదం లభిస్తే, దేశంలోని పరీక్షల నిర్వహణ వ్యవస్థలో మరింత కఠినమైన చట్టపరమైన వ్యవస్థ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

Tags

Be the first to react

Latest