CBI: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. 13 మందిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు!
CBI: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ (NEET-UG) 2026 పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో అరెస్టయి ప్రస్తుతం న్యాయ విచారణలో ఉన్న 13 మంది నిందితులపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. పేపర్ లీక్ కుట్ర, ప్రశ్నాపత్రాల అక్రమ చలామణి, అభ్యర్థులకు లీకైన ప్రశ్నలను చేరవేయడం వంటి అంశాలకు సంబంధించిన కీలక ఆధారాలను చార్జిషీట్‌లో పొందుపరిచింది.
ఎన్‌టీఏ నిపుణులు, కోచింగ్ సెంటర్ యజమాని సహా పలువురిపై అభియోగాలు..
360 మంది సాక్షులు, 422 పత్రాలు, 43 కీలక ఆధారాలతో విచారణ ముందుకు..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ (NEET-UG) 2026 పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో అరెస్టయి ప్రస్తుతం న్యాయ విచారణలో ఉన్న 13 మంది నిందితులపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. పేపర్ లీక్ కుట్ర, ప్రశ్నాపత్రాల అక్రమ చలామణి, అభ్యర్థులకు లీకైన ప్రశ్నలను చేరవేయడం వంటి అంశాలకు సంబంధించిన కీలక ఆధారాలను చార్జిషీట్‌లో పొందుపరిచింది.
ఈ ఏడాది మే 3న నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో, ఉన్నత విద్యా శాఖ మే 12న ఫిర్యాదు చేయడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. అనంతరం పరీక్షను రద్దు చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీయగా, నెలకు పైగా కొనసాగిన నిరసనల నేపథ్యంలో జూలై 25న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
చార్జిషీట్‌లో నిందితులపై నేరపూరిత కుట్ర, మోసం, నమ్మకద్రోహం, ఆధారాల ధ్వంసం, అలాగే అవినీతి నిరోధక చట్టం మరియు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం కింద అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో 360 మంది సాక్షులు, 422 పత్రాలు, 43 భౌతిక ఆధారాలను సీబీఐ కోర్టుకు సమర్పించింది.
ఈ కేసు దర్యాప్తు కోసం సీబీఐ 72 మంది అధికారులు, సిబ్బందితో పాటు ఎనిమిది మంది సైబర్ ఫోరెన్సిక్ నిపుణులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లోని 92 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో డిజిటల్ పరికరాలు, కమ్యూనికేషన్ సాధనాలు, కీలక పత్రాలు తదితర ఆధారాలను స్వాధీనం చేసుకుంది.
వీటిపై ఫోరెన్సిక్ విశ్లేషణ చేపట్టిన అనంతరం, పేపర్ లీక్ జరిగిన విధానం, ప్రశ్నాపత్రాలు ఎలా బయటకు వచ్చాయి, ఎవరి ద్వారా అభ్యర్థులకు చేరాయన్న అంశాలను దర్యాప్తు బృందం గుర్తించినట్లు తెలిపింది.
పేపర్ లీక్ జరిగిన మూలం నుంచి లీకైన ప్రశ్నలు పొందిన అభ్యర్థుల వరకు మొత్తం చైన్ ను గుర్తించినట్లు సీబీఐ వెల్లడించింది. ఈ కేసులో మొదటి అరెస్టు మే 13, 2026న జరిగినట్లు తెలిపింది. అనంతరం దర్యాప్తు విస్తరించి, పలువురు కీలక నిందితులను అదుపులోకి తీసుకుంది.
అరెస్టయిన వారిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కు చెందిన ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులు కూడా ఉండటం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది. వారిలో... రసాయన శాస్త్ర(కెమిస్త్రీ) నిపుణుడు పీ.వి. కులకర్ణి, జీవశాస్త్ర (బయాలజీ) నిపుణురాలు మనీషా గురునాథ్ మండారే, భౌతిక శాస్త్ర(ఫిజిక్స్) నిపుణురాలు మనీషా సంజయ్ హవల్దార్ ఉన్నారు.
మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన ఆర్‌సీసీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ యజమాని, ప్రొఫెసర్ శివరాజ్ మోటేగావంకర్ ఈ కేసులో కీలక నిందితుడిగా సీబీఐ పేర్కొంది. అలాగే ప్రశ్నాపత్రాలను సేకరించి పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు మధ్యవర్తులను కూడా అరెస్టు చేసింది. పుణెలోని ఏపీఎంఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఫిజిక్స్ అధ్యాపకుడు తేజస్ హర్షద్‌కుమార్ షా కూడా నిందితుల జాబితాలో ఉన్నారు.
డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ, చేతిరాత నిపుణుల అభిప్రాయాలు, విద్యా నిపుణుల నివేదికలను సీబీఐ పరిశీలించింది. పరీక్ష జరగకముందే లీకైన ప్రశ్నాపత్రాలు నిందితుల ద్వారా చలామణి అయినట్లు ఈ నివేదికలు నిర్ధారించాయని సీబీఐ వెల్లడించింది.
చార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ, ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని సీబీఐ స్పష్టం చేసింది. పేపర్ లీక్‌కు సంబంధించిన పూర్తి కుట్రలో మరికొందరి పాత్ర ఉందా? అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతున్నట్లు తెలిపింది.
దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక వైద్య ప్రవేశ పరీక్షలో చోటుచేసుకున్న ఈ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు తదుపరి దశలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Tags
Be the first to react
