⚡ BREAKING

Chandrababu: ఎల్‌నినోపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి.. సీఎం చంద్రబాబు ఆదేశాలు!

Chandrababu: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు ముందస్తు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం పలు కీలక సూచనలు చేశారు.

Chandra Babu Naidu
Chandra Babu Naidu

ప్రజల అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ఉండాలి..

విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు..

అమరావతి: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు ముందస్తు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం పలు కీలక సూచనలు చేశారు.

ఈ ఏడాది పొడవునా ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన చర్యలను మరింత బలోపేతం చేయాలని, రైతులకు ఎల్‌నినో వల్ల కలిగే ప్రభావాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించి, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏ ప్రాంతంలో ఏ పంటలు సాగు చేయాలో రైతులకు వివరించాలని ఆదేశించారు. అవసరమైన చోట ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను ప్రోత్సహించాలని, ఈ కార్యక్రమాలను క్యాంపెయిన్ మోడ్‌లో అమలు చేయాలని సూచించారు.

వాతావరణ మార్పుల వల్ల రైతులకు నష్టం తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. పంటల బీమా యాక్షన్ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేసి, రైతులకు భరోసా కల్పించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ సేవల అమలులో ఇంకా కొంత లోటు కనిపిస్తోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇటీవల ఆలూరు నియోజకవర్గ పర్యటన సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుపై ప్రజల నుంచి వచ్చిన స్పందనను సమావేశంలో ప్రస్తావించారు.

ప్రజల అవసరాలు, వారి అంచనాలకు అనుగుణంగా ఉద్యోగుల పనితీరు మారాలని, ప్రతి శాఖ ప్రజాకేంద్రీకృత దృక్పథంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.

రంపచోడవరం ప్రాంతానికి చెందిన ప్రతిభావంతురాలైన విద్యార్థిని శివాని ఆత్మహత్య ఘటనను సీఎం చంద్రబాబు సమావేశంలో ప్రస్తావించారు. చదువులో అగ్రగామిగా ఉన్న విద్యార్థిని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతో బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా అంచనా వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

విద్యార్థుల మానసిక పరిస్థితిని గుర్తించేందుకు సైకోమెట్రిక్ పరీక్షలు నిర్వహించే దిశగా ఇప్పటికే విద్యాశాఖ చర్యలు ప్రారంభించిందని అధికారులు సీఎంకు వివరించారు.

దీనిపై స్పందించిన సీఎం, విద్యార్థుల మానసిక స్థితిని మరింత సమర్థంగా అంచనా వేసేందుకు నిపుణుల సేవలను వినియోగించాలని సూచించారు. అలాగే ఉపాధ్యాయులకు కూడా విద్యార్థుల మానసిక సమస్యలను గుర్తించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.

ఆర్టీజీఎస్ సమీక్ష సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారధి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి రైతులను అప్రమత్తం చేయడం, పంటల ఎంపిక నుంచి బీమా వరకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగడం, అలాగే విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సూచనలు ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ప్రజలకు మరింత చేరువయ్యే పాలన, ముందస్తు ప్రణాళికతో నష్టాలను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సమీక్ష సమావేశం ద్వారా మరోసారి స్పష్టమైంది.

Tags

Be the first to react

Latest