⚡ BREAKING

Nara Lokesh: దమ్ముంటే చర్చకు రా జగన్.. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సవాల్! 150 రోజుల్లో..

Nara Lokesh: డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ అధినేత జగన్‌కు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. డీఎస్సీ అంశంపై జగన్‌తో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే చర్చకు రావాలని ఆయన అన్నారు.

దమ్ముంటే చర్చకు రా జగన్
దమ్ముంటే చర్చకు రా జగన్
  • వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్, భూకుంభకోణాలపైనా చర్చిద్దామని లోకేశ్ సవాల్..

  • Politics: కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేడర్‌కు పిలుపు..

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉపాధ్యాయ నియామకాల (Mega DSC) అంశం తీవ్ర వేడిని రాజేస్తోంది. డీఎస్సీ నిర్వహణ మరియు నియామకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) చేస్తున్న వరుస ఆరోపణల నేపథ్యంలో, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బహిరంగ సవాల్ విసిరారు. డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ఎక్కడైనా, ఎప్పుడైనా ముఖాముఖి చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, ధైర్యముంటే జగన్ చర్చకు రావాలని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేశ్, జగన్ నాయకత్వ శైలి మరియు గత ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

సమావేశంలో ఉద్వేగభరితంగా ప్రసంగించిన నారా లోకేశ్, "గొడ్డలి పార్టీ అధినేత డీఎస్సీపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు నేను ఎల్లవేళలా సిద్ధం. ఈ చర్చ కేవలం విద్యాశాఖ, డీఎస్సీలకే పరిమితం కాదు; గత ఐదేళ్ల వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం, భూ కుంభకోణాలపై కూడా బహిరంగంగా విశ్లేషిద్దాం" అని సవాల్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 150 రోజుల్లోనే అత్యంత పారదర్శక పద్ధతిలో వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లు పాటిస్తూ డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేసిందని చెప్పారు. ఈ నియామక ప్రక్రియను నిలిపివేసేందుకు ప్రతిపక్షం కోర్టుల్లో దాదాపు 150 కేసులు వేయించినప్పటికీ, న్యాయస్థానాలు ఆ పిటిషన్లను కొట్టివేయడమే కూటమి ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమని స్పష్టం చేశారు.గత టీడీపీ హయాంలో 2 లక్షల మంది ఉపాధ్యాయులను భర్తీ చేసిన ఘనత ఉంటే, ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయని నీచ చరిత్ర జగన్‌ది అని ధ్వజమెత్తారు.

రాజకీయ సిద్ధాంతాల గురించి మాట్లాడుతూ, "తెలుగుదేశం పార్టీ విధానం నవ్యాంధ్ర అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమం అయితే.. వైసీపీ విధానం విధ్వంసం, బూతులు మాట్లాడటం, సొంత బాబాయ్‌ను గొడ్డలితో లేపేయడం, చివరకు కన్న తల్లిని, చెల్లిని ఇల్లు వదిలి పొమ్మని తరిమేయడమే" అని ఘాటుగా విమర్శించారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ ‘క్రెడిట్ చోర్ డిజార్డర్’ (CCD) అనే మానసిక భావనతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకొచ్చిన గ్లోబల్ దిగ్గజ సంస్థలైన ఆర్సెలర్ మిట్టల్, గూగుల్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి పారిశ్రామిక ప్రాజెక్టులను కూడా తనే తెచ్చానని చెప్పుకోవడం ఆయన అభూతకల్పనలకు నిదర్శనమన్నారు.

రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, సంక్షేమం మరియు అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని లోకేశ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజానుకూల విధానాలను, సంక్షేమ పథకాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అలాగే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి వందకు వంద శాతం స్థానాలను కైవసం చేసుకునేలా ప్రతి కార్యకర్త శ్రమించాలని దిశానిర్దేశం చేశారు.

Tags

Be the first to react

Latest