⚡ BREAKING

Nara Lokesh: ప్రభుత్వ బడి నుంచి మిషన్ ‘శక్తిశాట్’కు ఎంపిక... విద్యార్థిని జెస్సీకి మంత్రి లోకేశ్ అభినందనలు

Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ అసాధారణ ప్రతిభతో ప్రపంచ వేదికపైకి అడుగుపెట్టిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థినికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రపంచంలోనే తొలి ఆల్-గర్ల్స్ గ్లోబల్ లూనార్ క్యూబ్‌శాట్ ‘మిషన్ శక్తిశాట్’కు ఎంపికైన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం విద్యార్థిని కందుల జెస్సీ, సోమవారం ఉండవల్లిలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిసింది.

ప్రభుత్వ బడి నుంచి మిషన్ ‘శక్తిశాట్’కు ఎంపిక...
ప్రభుత్వ బడి నుంచి మిషన్ ‘శక్తిశాట్’కు ఎంపిక...
  • ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఈ ఘనత సాధించిన తూర్పుగోదావరి విద్యార్థిని..

  • Politics: గ్లోబల్ లూనార్ మిషన్ ‘శక్తిశాట్’కు ఎంపికైన విద్యార్థిని జెస్సీ..

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్యా రంగానికి గర్వకారణంగా నిలుస్తూ, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఒక సామాన్య విద్యార్థిని అంతర్జాతీయ స్థాయి స్పేస్ ప్రాజెక్ట్‌కు ఎంపికై చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆల్-గర్ల్స్ గ్లోబల్ లూనార్ క్యూబ్‌శాట్ ప్రాజెక్ట్ ‘మిషన్ శక్తిశాట్’ (Mission ShakthiSat) కు ఎంపికైన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని కందుల జెస్సీని రాష్ట్ర విద్యా, ఐటీ మరియు హెచ్‌ఆర్‌డీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా అభినందించారు. ఉండవల్లిలోని నివాసంలో జెస్సీ, ఆమె కుటుంబ సభ్యులు మరియు ఉపాధ్యాయులతో భేటీ అయిన మంత్రి, ఆమె భవిష్యత్ అంతరిక్ష పరిశోధనలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

ధవళేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) లో పదో తరగతి చదువుతున్న కందుల జెస్సీ, ‘మిషన్ శక్తిశాట్’ ప్రాజెక్ట్ కోసం భారతదేశం నుంచి ఎంపికైన 20 మంది అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థినులలో ఒకరిగా చోటు దక్కించుకుంది. అంతేకాకుండా, ఈ ప్రతిష్టాత్మక స్పేస్ మిషన్‌కు ఎంపికైన ఏకైక ఆంధ్రప్రదేశ్ విద్యార్థినిగా రికార్డు సృష్టించింది. తన పాఠశాలలోని 'అటల్ టింకరింగ్ ల్యాబ్స్' (Atal Tinkering Labs) లో చేసిన శాస్త్రీయ ప్రయోగాలే తనకు అంతరిక్ష విజ్ఞానం పట్ల ఆసక్తి పెరిగేలా చేశాయని జెస్సీ మంత్రి లోకేశ్‌కు వివరించింది. ఏడో తరగతి నుంచే స్పేస్ సైన్స్ వైపు ఆకర్షితురాలినైన తాను, మిషన్ శక్తిశాట్ శిక్షణలో భాగంగా 21 మాడ్యూల్స్ వ్యాప్తంగా దాదాపు 550 తీవ్రమైన శిక్షణా సెషన్లను పూర్తి చేశానని తెలిపింది. భవిష్యత్తులో ఉన్నత చదువులు పూర్తి చేసి ‘ఏరోనాటికల్ ఇంజనీర్’ (Aeronautical Engineer) గా స్థిరపడటమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంది.

జెస్సీ సాధించిన ఈ అరుదైన విజయాన్ని కొనియాడిన మంత్రి నారా లోకేశ్, ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర ప్రతిష్టను చాటిచెప్పడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి చేస్తున్న 22 ప్రత్యేక క్లస్టర్లలో ‘స్పేస్ సిటీ క్లస్టర్’ కూడా ఉందని, రాబోయే రోజుల్లో అంతరిక్ష రంగంలో యువతకు అపారమైన ఉద్యోగ, పరిశోధనా అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన స్పష్టం చేశారు. అనంతరం మంత్రి నారా లోకేశ్ అధికారికంగా మిషన్ శక్తిశాట్ విశేషాలతో కూడిన పోస్టర్‌ను ఆవిష్కరించి జెస్సీకి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ప్రత్యేక అభినందన కార్యక్రమంలో మిషన్ శక్తిశాట్ డైరెక్టర్ మరియు 'స్పేస్ కిడ్జ్ ఇండియా' (Space Kidz India) సీఈవో డాక్టర్ శ్రీమతి కేశన్, సంస్కార ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ జ్యోత్స్న తిరునగరి, పాఠశాల ఉపాధ్యాయురాలు కె.మణిమాల తదితరులు పాల్గొని జెస్సీ కృషిని అభినందించారు.

Tags

Be the first to react

Latest