నెల్లూరులో తండ్రి ఆసుపత్రి చైర్మన్.. భర్త కార్డియాలజిస్ట్.. అయినా దక్కని ప్రాణాలు! 32 ఏళ్లకే గుండెపోటుతో...
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంటకు చెందిన ఎన్ఎల్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ దశరథ నాగేంద్ర ప్రసాద్, లక్ష్మి దంపతుల కుమార్తె డాక్టర్ లావణ్య. 2016లో నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె, బెంగళూరులో జనరల్ మెడిసిన్, ఆ తర్వాత చెన్నైలో డీఎం న్యూరాలజీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. అనంతరం నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో (ACSR GMC) అసోసియేట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టి ఎందరో రోగులకు నిస్వార్థ వైద్య సేవలు అందించారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్‌ను వివాహం చేసుకున్న ఆమెకు ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు.
2025లో అరుదైన నరాల వ్యాధి 'మయాస్తీనియా గ్రావిస్' (Myasthenia Gravis)ను ఆత్మస్థైర్యంతో జయించిన ధీరవనిత!
నాలుగు నెలల్లోనే కోలుకుని పేద రోగులకు ఉచిత న్యూరాలజీ వైద్య సేవలందించిన సేవామూర్తి!
చికిత్స అందించే సమయం కూడా ఇవ్వకుండా ప్రాణాలు తీసిన ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్!
Media: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఎందరో రోగులకు నూతన జీవితాన్ని ప్రసాదించిన ప్రముఖ యువ న్యూరాలజిస్ట్ డాక్టర్ కుంకాల లావణ్య (32) ఆకస్మిక గుండెపోటుతో కన్నుమూశారు. తండ్రి ప్రముఖ ఎన్ఎల్ (NL) ఆసుపత్రి చైర్మన్ కాగా, భర్త ప్రముఖ కార్డియాలజిస్ట్ (గుండె వైద్య నిపుణుడు). స్వయంగా ఆమె అత్యున్నత స్థాయి నరాల వైద్య నిపుణురాలు. ఇంతటి విస్తారమైన వైద్య నేపథ్యం, అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్న కుటుంబంలోనూ విధి ఆడిన వింత నాటకంలో వైద్యం సైతం నిస్సహాయంగా మిగిలిపోవడం అందరి హృదయాలను కలచివేసింది.
బంగారు పతక విజేతగా విద్యా ప్రస్థానం
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంటకు చెందిన ఎన్ఎల్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ దశరథ నాగేంద్ర ప్రసాద్, లక్ష్మి దంపతుల కుమార్తె డాక్టర్ లావణ్య. 2016లో నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె, బెంగళూరులో జనరల్ మెడిసిన్, ఆ తర్వాత చెన్నైలో డీఎం న్యూరాలజీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. అనంతరం నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో (ACSR GMC) అసోసియేట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టి ఎందరో రోగులకు నిస్వార్థ వైద్య సేవలు అందించారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్‌ను వివాహం చేసుకున్న ఆమెకు ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు.
అరుదైన నరాల వ్యాధిపై గెలిచిన ధీరవనిత
ఎంతో సంతోషంగా సాగిపోతున్న ఆమె జీవితంలో గత ఏడాది (2025) తీవ్ర అనారోగ్య సమస్య ఎదురైంది. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న ఆమె సడన్‌గా మాట్లాడే శక్తిని కోల్పోయి, కనీసం నిలబడలేని స్థితికి చేరుకున్నారు. వైద్య పరీక్షల్లో ఆమెకు అత్యంత అరుదైన ఆటో ఇమ్యూన్ నాడీ సమస్య 'మయాస్తీనియా గ్రావిస్' (Myasthenia Gravis) సోకినట్లు నిర్ధారణ అయింది. సాధారణ వ్యక్తులైతే మానసికంగా కుంగిపోయే ఆ సమయంలో, లావణ్య ఏమాత్రం అధైర్యపడకుండా కీలకమైన శస్త్రచికిత్స చేయించుకుని అద్భుతమైన ఆత్మస్థైర్యంతో మృత్యుముఖం నుంచి క్షేమంగా బయటపడ్డారు.
సేవా మార్గంలోనే అనంత లోకాలకు
నరాల వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత వైద్యులు విశ్రాంతి తీసుకోమని చెప్పినప్పటికీ, కేవలం నాలుగు నెలల్లోనే ఆమె తిరిగి తన విధుల్లో చేరారు. అక్కడితో ఆగకుండా గ్రామీణ ప్రాంతాలకు స్వయంగా వెళ్లి పేద ప్రజలకు ఉచితంగా న్యూరాలజీ వైద్య శిబిరాలను నిర్వహించి మందులు అందించడం ప్రారంభించారు. అంతటి ప్రమాదకరమైన నాడీ రుగ్మతను ధైర్యంతో జయించిన ఆ ధీరవనితను విధి ఆకస్మిక గుండెపోటు రూపంలో కబళించింది. కనీసం వైద్యం అందించే సమయం కూడా ఇవ్వకుండా క్షణాల వ్యవధిలోనే ఆమె తుదిశ్వాస విడిచారు. సొంత ఆసుపత్రి, కార్డియాలజిస్ట్ అయిన భర్త పక్కనే ఉన్నా ఆమెను కాపాడుకోలేకపోయామని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దిగ్భ్రాంతి & సంతాపం
డాక్టర్ లావణ్య ఆకస్మిక మృతి పట్ల మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్ఎల్ ఆసుపత్రి చైర్మన్ దశరథ నాగేంద్ర ప్రసాద్ కుటుంబంతో తమకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందని, ఆయన కుమార్తె లావణ్య ఇంత చిన్న వయసులోనే కన్నుమూయడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు భవిష్యత్తు ఉన్న ప్రతిభావంతురాలైన వైద్యురాలిని కోల్పోవడం నెల్లూరు వైద్య రంగానికే తీరని లోటని పేర్కొంటూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.
Tags
Be the first to react