భారత జీవిత బీమా సంస్థ (LIC) పాలసీదారులకు శుభవార్త చెప్పింది. ఏవైనా ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత కారణాలు లేదా అనుకోని పరిస్థితుల వల్ల నిలిచిపోయిన (ల్యాప్స్ అయిన) వ్యక్తిగత బీమా పాలసీలను తక్కువ ఖర్చుతో పునరుద్ధరించుకునేందుకు ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రత్యేక రివైవల్ క్యాంపెయిన్ జనవరి 1, 2026 నుంచి ప్రారంభమై మార్చి 2, 2026 వరకు కొనసాగనుంది. ఈ కాలవ్యవధిలో పాలసీదారులు తమ పాత, నిలిచిపోయిన “నాన్-లింక్డ్” పాలసీలను సులభంగా మళ్లీ యాక్టివ్ చేసుకునే అవకాశం కల్పించారు. ముఖ్యంగా ఆలస్య రుసుముల భారం తగ్గించడమే ఈ ప్రచారం ప్రధాన లక్ష్యంగా LIC ప్రకటించింది.
సాధారణంగా ప్రీమియంలు ఆలస్యమైతే భారీ జరిమానాలు పడతాయన్న భయంతో చాలామంది పాలసీదారులు పునరుద్ధరణకు ముందుకు రారు. ఈ సమస్యను గుర్తించిన LIC, ఈసారి వినియోగదారులకు ఊరటనిచ్చేలా ఆకర్షణీయమైన రాయితీలు ప్రకటించింది. నాన్-లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలపై ఆలస్య రుసుమును 30 శాతం వరకు తగ్గిస్తోంది. గరిష్టంగా రూ.5,000 వరకు డిస్కౌంట్ లభించనుంది. ఇక సూక్ష్మ బీమా పాలసీలు తీసుకున్న పేద, బలహీన వర్గాల వారికి మరింత ఊరట కల్పిస్తూ, ఆలస్య రుసుముపై 100 శాతం మినహాయింపును అందిస్తోంది. అంటే ఈ వర్గాల వారు పాలసీ పునరుద్ధరణకు ఒక్క రూపాయి కూడా జరిమానాగా చెల్లించాల్సిన అవసరం లేదు.
ఈ ప్రచారం ముఖ్యంగా సకాలంలో ప్రీమియంలు చెల్లించలేక పాలసీ ల్యాప్స్ అయిన వారికి ఉద్దేశించిందని LIC స్పష్టం చేసింది. ప్రీమియం చెల్లింపు కాలంలోనే పాలసీ నిలిచిపోయి, కానీ ఇంకా మెచ్యూరిటీకి చేరుకోని పాలసీలను మాత్రమే ఈ పథకం కింద పునరుద్ధరించుకోవచ్చు. అయితే, ఈ రాయితీలు కేవలం ఆలస్య రుసుముపైనే వర్తిస్తాయని సంస్థ స్పష్టంగా తెలిపింది. పాలసీ పునరుద్ధరణకు వైద్య పరీక్షలు లేదా ఆరోగ్య పరీక్షలు అవసరమైతే, వాటిపై ఎలాంటి రాయితీలు వర్తించవని LIC పేర్కొంది. కాబట్టి పాలసీదారులు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది.
LIC ప్రకారం, పాలసీ యాక్టివ్‌గా ఉన్నప్పుడే బీమా పూర్తి ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి. పాలసీ ల్యాప్స్ అయితే మరణ ప్రయోజనం, మెచ్యూరిటీ బెనిఫిట్స్ వంటి కీలక లాభాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే పాలసీదారులు తమ రిస్క్ కవర్‌ను తిరిగి పొందేందుకు ఈ ప్రత్యేక అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సంస్థ సూచిస్తోంది. ల్యాప్స్ అయిన పాలసీ ఉన్నవారు తమ సమీపంలోని LIC బ్రాంచ్‌ను సందర్శించడం లేదా తమ ఏజెంట్‌ను సంప్రదించడం ద్వారా ఈ రాయితీలను పొందవచ్చు. ఈ ప్రత్యేక పునరుద్ధరణ అవకాశం మార్చి 2, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని LIC గుర్తుచేసింది.