Jasmine Gardening Tips: వేసవికాలం వచ్చిందంటే చాలు మన పెరట్లో మల్లెపూల సువాసనలు వెదజల్లుతుంటాయి. చాలామంది తమ ఇంట్లో మల్లె చెట్లు ఉన్నా కూడా పువ్వులు సరిగ్గా పూయడం లేదని నర్సరీల చుట్టూ తిరుగుతుంటారు. వాస్తవానికి మొక్కను తెచ్చిన కొత్తలో బాగానే పూసినా, ఆ తర్వాత మొగ్గలు రావడం తగ్గిపోతుంటుంది. కానీ కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు, మీ కురుల్లో మల్లెలను మూరలు మూరలుగా అలంకరించుకోవచ్చు.
మల్లె మొక్కలకు అన్నింటికంటే ముఖ్యమైనది సూర్యరశ్మి. రోజుకు కనీసం ఐదు నుంచి ఆరు గంటల పాటు నేరుగా ఎండ తగిలే చోట మొక్కను ఉంచాలి, లేదంటే మొక్క సరిగ్గా పెరగదు. ఎండ తగలకపోతే మొగ్గలు రావడం చాలా కష్టమవుతుంది. అలాగే మొక్క చుట్టూ గాలి బాగా ఆడేలా చూడాలి. గాలి తగలకపోతే ఆకులపై తేమ చేరిపోయి ఫంగస్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
మొక్క బలంగా ఎదగాలంటే మనం వేసే మట్టిలో కూడా పోషకాలు ఉండాలి. కేవలం ఎర్రమట్టి మాత్రమే కాకుండా అందులో కొంచెం ఇసుక, కోకోపీట్ పశువుల ఎరువు కలిపి వాడటం మంచిది. మనం ఇంట్లో వాడేసిన టీ పొడిని బాగా కడిగి ఎండబెట్టి మొక్కలకు వేస్తే అద్భుతమైన ఎరువులా పనిచేస్తుంది. అలాగే గుడ్డు పెంకుల పొడిలో ఉండే కాల్షియం మొక్కకు మంచి బలాన్ని ఇస్తుంది.
నీరు పోసే విషయంలో కూడా కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. మట్టి పైపొర ఆరిపోయినట్లు అనిపిస్తేనే నీరు పోయాలి, వేసవిలో రోజుకు రెండు సార్లు పోస్తే సరిపోతుంది. ముఖ్యంగా నీటిని నేరుగా మట్టిలోనే పోయాలి కానీ ఆకులపై చల్లకూడదు, అలా చేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఉదయం పూట నీరు పోయడం మొక్క ఆరోగ్యానికి చాలా మంచిది.
మల్లెలు విపరీతంగా పూయాలంటే కత్తిరింపులు చాలా అవసరం. ఎండిపోయిన కొమ్మలను, పసుపు రంగులోకి మారిన ఆకులను ఎప్పటికప్పుడు తీసేయాలి. అలాగే మనం వాడే శనగపిండిని నీటిలో కలిపి రెండు రోజులు పులియబెట్టి మొక్కలకు వేస్తే మొగ్గలు బాగా వస్తాయి. పుల్లటి మజ్జిగను నీటిలో కలిపి మొక్క మొదట్లో పోస్తే ఫంగస్ సమస్య ఉండదు. ఇలాంటి చిన్న చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లో మల్లెలు విరబూస్తాయి.