ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. త్వరలోనే రాష్ట్రానికి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి రానుంది. రైల్వే శాఖ తాజాగా విజయవాడ–బెంగళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మంజూరు చేసింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఈ రైలు నవంబర్ నెలాఖరులో పట్టాలెక్కనుంది. ఇప్పటికే రైల్వే శాఖ ఈ రైలు మార్గం, షెడ్యూల్ ఖరారు చేసింది. కొత్త రైలు ద్వారా విజయవాడ నుంచి బెంగళూరు వరకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.
విజయవాడ–బెంగళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వారంలో ఆరు రోజులపాటు నడుస్తుంది. మంగళవారం మినహా మిగతా అన్ని రోజులూ ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఉదయం 5.15 గంటలకు విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు బెంగళూరుకు చేరుతుంది. తిరిగి 20712 నంబర్‌తో బెంగళూరు–విజయవాడ వందేభారత్ రైలు మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.45 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రైలు మార్గంలో తెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, కృష్ణరాజపురం స్టేషన్లలో హాల్ట్ సదుపాయం కల్పించారు.
మొత్తం ఎనిమిది బోగీలతో ఈ రైలు నడుస్తుంది. వీటిలో ఏడూ ఏసీ చైర్‌కార్ బోగీలు కాగా, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ బోగీగా ఉంటుంది. అత్యాధునిక సౌకర్యాలతో, స్మార్ట్ డోర్ సిస్టమ్, జీరో వైబ్రేషన్ టెక్నాలజీతో ఈ రైలు ప్రయాణికులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది. విజయవాడ నుంచి బెంగళూరు చేరుకోవడానికి ప్రస్తుతం ప్రయాణికులు ఉపయోగిస్తున్న కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైలు వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే నడుస్తోంది. దీంతో కొత్త వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలగనుంది.
విజయవాడ–బెంగళూరు వందేభారత్ రైలు ప్రారంభం వల్ల తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కూడా మేలు జరుగనుంది. ఈ రైలు ద్వారా విజయవాడ నుంచి తిరుపతి కేవలం నాలుగు గంటల 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఉదయం 5.15కు బయలుదేరే రైలు ఉదయం 9.45 గంటల సమయానికి తిరుపతి రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. అలాగే బెంగళూరు–విజయవాడ వందేభారత్ రైలు సాయంత్రం 6.55 గంటల సమయానికి తిరుపతికి చేరి, రాత్రి 11.45 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే వ్యాపార, పర్యాటక, విద్యా ప్రయాణాలకు మరింత వేగం అందనుందని అధికారులు పేర్కొంటున్నారు.