ఆంధ్రప్రదేశ్‌లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపుల షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ శ్రీనివాసుల రెడ్డి ప్రకటించారు. నవంబర్ 10న విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం నవంబర్ 13వ తేదీ నుంచి విద్యార్థులు ఫీజులు చెల్లించవచ్చని తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిల్ అయినవారు, ఒకేషనల్ విద్యార్థులు కూడా ఫీజు చెల్లించడానికి అర్హులని చెప్పారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 25 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది.
డైరెక్టర్ వివరాల ప్రకారం రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 26 నుంచి డిసెంబర్ 3 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 4 నుంచి 10 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 11 నుంచి 15 వరకు ఫీజులు చెల్లించవచ్చు. విద్యార్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే ఫీజు చెల్లించాలని ఆయన సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు సమయానికి ఫీజులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. ఫీజులు పాఠశాలల ప్రిన్సిపల్స్ లాగిన్ ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లో చెల్లించాల్సి ఉంటుంది.
ఫీజు రుసుముల వివరాలు కూడా వెల్లడించారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125 చెల్లించాలి. గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు పరీక్ష రాయాలనుకుంటే రూ.125, ఒకటి నుంచి మూడు సబ్జెక్టుల వరకు అయితే రూ.110 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వయస్సు నిర్ధారణ రుసుము కింద రూ.300 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఫీజు చెల్లింపుల గడువులో ఏదైనా తేదీ ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తే, తదుపరి పని దినాన్నే గడువుగా పరిగణిస్తారని వెల్లడించారు.
ఇక పదో తరగతి పబ్లిక్ పరీక్షలను మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపింది. అనుమతి లభించిన వెంటనే అధికారిక టైమ్‌టేబుల్‌ను కూడా విడుదల చేయనున్నారు. విద్యార్థులు ముందుగానే ఫీజు చెల్లించి, పరీక్షలకు సన్నద్ధం కావాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సూచించింది. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరుకానున్నారు.