ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాహనదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారిపై నేరుగా చలాన్లు వేయకుండా, ముందుగా వారికి అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర ప్రణాళిక అవసరమని భావించిన సీఎం, ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ చలాన్లు వేయాలన్న ప్రతిపాదనను ఆయన తిరస్కరించి, ప్రజలకు ముందుగా హెచ్చరికలు ఇవ్వడం మంచిదని సూచించారు.
సీఎం చంద్రబాబు, హెల్మెట్ లేకుండా లేదా సీటు బెల్ట్ లేకుండా వాహనాలు నడిపే వారిని ముందుగా హెచ్చరించాలని, ఆ తర్వాత కూడా తప్పు చేస్తేనే జరిమానాలు విధించాలని స్పష్టం చేశారు. ప్రజలను భయపెట్టడం కంటే, అవగాహన కల్పించడం ద్వారా బాధ్యతతో ప్రవర్తించేలా చేయాలని సూచించారు. కేరళ రాష్ట్రం అమలు చేస్తున్న విధానాలను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాటలు, అగ్ని ప్రమాదాలను తగ్గించడానికి సీసీ కెమెరాల వినియోగం, జనసందోహ నియంత్రణ పద్ధతులపై ఫోకస్ చేయాలని సీఎం సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) సిద్ధం చేయాలని, అందులో చర్యల ప్రణాళిక స్పష్టంగా ఉండాలని ఆదేశించారు. రోడ్ల పరిస్థితిని కూడా సమీక్షించి, లోపాలు ఉన్న చోట్ల వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు.
నిరుద్యోగ యువత కోసం రాష్ట్రవ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహించాలని, ఈ మేళాల గురించి విస్తృత ప్రచారం చేయాలని, తద్వారా ఎక్కువ మంది యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. రిజిస్ట్రేషన్ సేవల పనితీరులో మెరుగుదల అవసరమని గుర్తుచేసి, ఉన్నతాధికారులు పర్యవేక్షణను మరింత బలపరచాలని ఆదేశించారు.
పారిశుద్ధ్యం, రేషన్ పంపిణీ, దీపం-2 వంటి ప్రభుత్వ పథకాల అమలు స్థాయిని కూడా చంద్రబాబు పరిశీలించారు. ప్రజలకు ఈ పథకాలు పూర్తిగా చేరేలా చూడాలని, ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని అధికారులకు సూచించారు. ప్రజల సేవే ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి కార్యక్రమం ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు.