అమెరికా వెళ్లే భారతీయులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కీలక విషయాన్ని భారత్‌లోని అమెరికా ఎంబసీ మరోసారి గుర్తు చేసింది. అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చన్నది వీసా గడువు తేదీ ఆధారంగా కాకుండా, దేశంలోకి ప్రవేశించే సమయంలో కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారి నిర్ణయిస్తారని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంబసీ ‘X’ (ట్విట్టర్)లో ప్రకటన విడుదల చేసింది.
విదేశీ ప్రయాణికులు తమకు అనుమతించిన గడువును తెలుసుకోవాలంటే I-94 ఫారమ్‌లో ఉన్న ‘Admit Until Date’ను తప్పనిసరిగా పరిశీలించాలని ఎంబసీ సూచించింది. ఇదే చట్టబద్ధంగా అమెరికాలో ఉండే చివరి తేదీ అని తెలిపింది. వీసా గడువు ఎక్కువగా ఉన్నా, I-94లో పేర్కొన్న తేదీ వరకే అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
I-94 ఫారమ్ అనేది చాలా మంది నాన్-ఇమిగ్రెంట్ ప్రయాణికులకు తప్పనిసరి. విమానం లేదా సముద్ర మార్గంలో అమెరికాకు వెళ్లేవారికి ఇది ఆటోమేటిక్‌గా ఎలక్ట్రానిక్ రూపంలో జారీ అవుతుంది. అయితే భూసరిహద్దులు లేదా కొన్ని ఫెర్రీ మార్గాల ద్వారా వెళ్లేవారు అధికారిక వెబ్‌సైట్‌లో ముందుగా I-94 కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అమెరికా పౌరులు, శాశ్వత నివాసితులు, ఇమిగ్రెంట్ వీసా ఉన్నవారు, చాలా మంది కెనడియన్ ప్రయాణికులకు ఇది వర్తించదు.
ఈ హెచ్చరిక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన ఇమిగ్రేషన్ చర్యల నేపథ్యంలో వచ్చింది. సరిహద్దు భద్రత కఠినతరం చేస్తూ, ఉగ్రవాదం, వీసా గడువు మించిపోవడం, అవినీతి కారణాలుతో 19 దేశాల పౌరులపై ప్రయాణ పరిమితులు విధించారు. అలాగే డిసెంబర్ 15 నుంచి కొత్త సోషల్ మీడియా పరిశీలన నిబంధనలు అమలులోకి రావడంతో వీసా ప్రాసెసింగ్‌లో తీవ్ర ఆలస్యాలు ఏర్పడ్డాయి.
ఈ ప్రభావం ముఖ్యంగా భారతీయులపై ఎక్కువగా పడుతోంది. వీసా అపాయింట్‌మెంట్లు రద్దు కావడంతో వందలాది H-1B వీసా కలిగిన నిపుణులు భారత్‌లోనే చిక్కుకుపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. గూగుల్, ఆపిల్ వంటి పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులకు విదేశీ ప్రయాణాలు చేయొద్దని సూచించాయి. వీసా ప్రక్రియ ఆలస్యం కారణంగా అమెరికాకు తిరిగి వెళ్లడం నెలలు, కొన్నిచోట్ల ఏడాది వరకు కూడా పడొచ్చని హెచ్చరించాయి.