చైనా నుంచి తయారీ వ్యవస్థలను భారత్‌కు తరలించే వ్యూహంలో భాగంగా దిగ్గజ సంస్థ ఫాక్స్‌కాన్ భారీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే కర్ణాటకలోని తన యూనిట్‌లో నియామకాలను వేగవంతం చేసింది. బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో కేవలం 8 నుంచి 9 నెలల వ్యవధిలోనే సుమారు 30 వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంది. ఈ నియామకాల్లో అత్యధికంగా మహిళలే ఉండటం విశేషంగా మారింది. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఇది పెద్ద బూస్ట్‌గా పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
దేవనహళ్లిలో 300 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ దేశంలోనే రెండో అతిపెద్ద ఐఫోన్ అసెంబ్లీ యూనిట్‌గా నిలిచింది. ప్రారంభ దశలో ఐఫోన్ 16 మోడళ్ల తయారీతో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ యూనిట్‌లో ప్రస్తుతం ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడళ్ల ఉత్పత్తి కూడా జరుగుతోంది. ఇక్కడ తయారయ్యే ఐఫోన్లలో సుమారు 80 శాతం విదేశీ మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. దీంతో భారత్ నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి.
ఫాక్స్‌కాన్ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఈ యూనిట్‌ను మినీ టౌన్‌షిప్ తరహాలో అభివృద్ధి చేస్తూ ఉద్యోగుల కోసం నివాస సదుపాయాలు, వైద్య సేవలు, విద్యా వసతులు ఏర్పాటు చేసింది. సురక్షితమైన వాతావరణం, పని–జీవిత సమతుల్యతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఈ అనుకూల పరిస్థితులే భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయడానికి దోహదపడుతున్నాయని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది నాటికి ఈ యూనిట్‌లో ఉద్యోగుల సంఖ్యను 50 వేల వరకు పెంచాలని ఫాక్స్‌కాన్ లక్ష్యంగా పెట్టుకుంది.
తమిళనాడులోని ఐఫోన్ ప్లాంట్ తర్వాత ఇది ఫాక్స్‌కాన్ చేపట్టిన రెండో అతిపెద్ద ప్రాజెక్ట్. తమిళనాడులో ఇప్పటికే సుమారు 41 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, అక్కడ కూడా మహిళలే మెజారిటీగా ఉన్నారు. డిజైన్, టెక్నాలజీ విభాగాల్లో మహిళలను అగ్రగాములుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో నియామకాలు చేపడుతున్నట్లు ఫాక్స్‌కాన్ వెల్లడించింది. చైనా నుంచి భారత్‌కు తయారీ కేంద్రాల తరలింపులో ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు. భారత తయారీ రంగానికి ఇది దీర్ఘకాలికంగా భారీ ప్రయోజనం చేకూర్చనుంది.