బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే చాలామంది బాదాన్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటారు. ఇలా నానబెట్టిన బాదం తినడం వల్ల అవి తేలికగా జీర్ణం అవుతాయి. శరీరానికి అవసరమైన పోషకాలు సులభంగా శోషించబడతాయి. దీంతో బాదం వల్ల లభించే ప్రయోజనాలు మరింత పెరుగుతాయి.
నానబెట్టిన బాదంలో రైబోఫ్లేవిన్, ఎల్-కార్నిటిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి తగ్గకుండా కాపాడటంతో పాటు, మెదడును చురుకుగా ఉంచుతాయి. చదువుకునే విద్యార్థులు, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేవారికి నానబెట్టిన బాదం ఎంతో ఉపయోగకరం.
నానబెట్టిన బాదం సులభంగా నమలవచ్చు. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. దీంతో అనవసరమైన ఆకలి తగ్గి, ఆహారంపై నియంత్రణ పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారు లేదా బరువును అదుపులో ఉంచాలనుకునేవారికి ఇది మంచి ఆహార ఎంపికగా చెప్పవచ్చు.
మోనో అన్‌సాచ్యురేటెడ్ కొవ్వులతో నిండిన నానబెట్టిన బాదం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచుతాయి. అలాగే విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సూర్యరశ్మి ప్రభావం నుంచి, ఆక్సీకరణ ఒత్తిడినుంచి రక్షిస్తాయి. దీంతో చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
నానబెట్టిన బాదం ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, నీటిలో నానబెట్టడం వల్ల విటమిన్ బీ, సీ వంటి నీటిలో కరిగే విటమిన్లు కొంత తగ్గే అవకాశం ఉంది. అలాగే బాదం సహజమైన కరకరలాడే రుచి కొద్దిగా తగ్గుతుంది. అయినప్పటికీ, మొత్తం మీద నానబెట్టిన బాదం రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి ఉపయోగకరమే అని నిపుణులు చెబుతున్నారు.