తిరుపతి జిల్లా శెట్టిపల్లెలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. అన్‌సెటిల్డ్ ఎస్టేట్ భూములకు సంబంధించి కొనసాగుతున్న సమస్యను పరిష్కరించడం ద్వారా 2,111 పేద కుటుంబాలకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కుటుంబాలకు సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇళ్ల స్థల పట్టాలు అందజేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు.
ఈ భూ సమస్య కారణంగా ఎన్నో సంవత్సరాలుగా పేద కుటుంబాలు అనిశ్చితిలో జీవించాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. భూముల అక్రమాలకు పాల్పడిన వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి, ఈ ఏడాదిని ‘భూనామ సంవత్సరం’గా అభివర్ణిస్తూ అక్రమార్కులకు చుక్కలు చూపిస్తామని స్పష్టం చేశారు.
న్యూ ఇయర్ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిషేధిత 22ఏ జాబితా నుంచి ఐదు రకాల భూములకు విముక్తి కల్పిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏ భూమికి సంబంధించినదైనా ఎనిమిది రకాల చెల్లుబాటు అయ్యే పత్రాల్లో ఏదో ఒకటి ఉంటే, ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని మంత్రి ఆదేశించారు. దీంతో అనేక మంది భూ యజమానులకు పెద్ద ఊరట లభించనుంది.
ఇకపై ప్రైవేటు భూములను నిషేధిత జాబితాలో ఉంచే అవకాశం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చుక్కల భూములు, రీసర్వే తర్వాత నిషేధ జాబితాలో చేర్చిన సర్వీస్ ఈనాం భూములపై కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తప్పుడు రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారాలను కలెక్టర్లకు అప్పగించడంతో పాటు, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునే అధికారం కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
భూ సమస్యల పరిష్కారంలో పారదర్శకత కోసం వివిధ రెవెన్యూ రికార్డులను సమగ్రంగా పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. అడంగల్, అసైన్‌మెంట్ రిజిస్టర్లు, రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు వంటి కీలక డాక్యుమెంట్లను ఆధారంగా తీసుకుని అర్హులను గుర్తిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తమైంది.