జాతీయ రహదారులపై ప్రయాణించే లక్షలాది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. కార్లు, జీపులు, వ్యాన్‌లకు సంబంధించిన ఫాస్టాగ్‌లపై ఇప్పటివరకు అమల్లో ఉన్న ‘నో యువర్ వెహికల్’ (KYV) ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఫాస్టాగ్ యాక్టివేషన్ సమయంలో ఎదురవుతున్న అనవసర జాప్యం, సాంకేతిక సమస్యలకు చెక్ పడనుంది. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గి, ప్రయాణం మరింత సులభం కానుంది.
ఫాస్టాగ్ యాక్టివేట్ అయిన తర్వాత కూడా KYV అప్‌డేట్ కాలేదన్న కారణంతో వినియోగదారులు పలుమార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. వాహనానికి సంబంధించిన అన్ని చెల్లుబాటు అయ్యే పత్రాలు ఉన్నప్పటికీ, KYV సమస్యల వల్ల ఫాస్టాగ్‌లు బ్లాక్ కావడం, రీఛార్జ్‌లు పని చేయకపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. ఈ పరిస్థితిని పూర్తిగా నివారించేందుకే KYV ప్రక్రియను రద్దు చేస్తూ ఈ సంస్కరణ తీసుకొచ్చినట్లు వివరించింది. తాజా నిర్ణయంతో వాహనదారులకు సమయంతో పాటు మానసిక ఒత్తిడి కూడా తగ్గనుందని అధికారులు అభిప్రాయపడ్డారు.
ఈ మినహాయింపు కేవలం కొత్తగా జారీ చేసే ఫాస్టాగ్‌లకే కాకుండా, ఇప్పటికే ఉన్న ఫాస్టాగ్‌లకూ వర్తిస్తుందని NHAI స్పష్టం చేసింది. అయితే ఫాస్టాగ్ దుర్వినియోగం, తప్పుడు జారీ, లేదా ప్రత్యేక ఫిర్యాదులు నమోదైన సందర్భాల్లో మాత్రమే KYV ప్రక్రియ అవసరమవుతుందని తెలిపింది. ఎలాంటి ఫిర్యాదులు లేని పాత ఫాస్టాగ్‌లకు ఇకపై KYV తప్పనిసరి కాదని వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల సాధారణ వాహనదారులపై అదనపు భారం తొలగిపోగా, నిజమైన సమస్యలపై మాత్రమే దృష్టి పెట్టే అవకాశం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
వినియోగదారుల ప్రక్రియను సులభతరం చేస్తూనే, వ్యవస్థలో పారదర్శకత, కచ్చితత్వాన్ని పెంచేందుకు బ్యాంకులపై కీలక బాధ్యతలు అప్పగించింది NHAI. ఇకపై ఫాస్టాగ్ యాక్టివేషన్‌కు ముందే వాహన్ డేటాబేస్ ద్వారా వాహన వివరాలను తప్పనిసరిగా ధృవీకరించాల్సి ఉంటుంది. వాహన్ పోర్టల్‌లో వివరాలు అందుబాటులో లేకపోతే, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) ఆధారంగా పూర్తిగా సరిచూసుకున్న తర్వాతే ఫాస్టాగ్‌ను యాక్టివేట్ చేయాలని ఆదేశించింది. ఆన్‌లైన్‌లో విక్రయించే ఫాస్టాగ్‌లకూ ఇదే నిబంధన వర్తిస్తుంది. ఈ మార్పులతో వెరిఫికేషన్ బాధ్యత మొత్తం బ్యాంకులపైనే ఉంటుందని, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీ ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యమని NHAI స్పష్టం చేసింది.