కీర దోసకాయ చిన్న పిల్లల నుండి పెద్దల వరకూ అందరూ ఇష్టపడే ఆహారం. ఇది ఎక్కువగా సలాడ్ రూపంలో తీసుకుంటారు. మరికొందరు రైతా, జ్యూస్, శాండ్‌విచ్, స్మూతీ లాంటి వేర్వేరు రూపాల్లో తీసుకుంటారు. 95% పైగా నీరు ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు.
కీర దోసకాయలో విటమిన్ K, విటమిన్ C, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యం, చర్మ ఆరోగ్యం, జీర్ణక్రియ, రక్తపోటు నియంత్రణ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతాయి. అయితే, ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ కీర దోసకాయ అందరికీ సరిపోదు.
కీర దోసకాయ శరీరాన్ని చల్లబరచే స్వభావం కలిగి ఉండడం వల్ల కఫ దోషాన్ని పెంచే అవకాశం ఉంది. తరచూ జలుబు, దగ్గు, శ్లేష్మం, సైనస్ సమస్యలు, ఉబ్బసం, బ్రోంకైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు కీర దోసకాయ తినడం మంచిది కాదు. ముఖ్యంగా చలికాలంలో ఈ ఆహారం తీసుకుంటే సమస్యలు మరింత తీవ్రమవుతాయి.
ఇలాంటి కఫ సంబంధిత సమస్యలు ఉన్నవారి ముక్కు దిబ్బడ, దగ్గు, శ్లేష్మం మోతాదు పెరగవచ్చు. సైనసిటిస్, దీర్ఘకాలిక జలుబు, ఆస్థమా ఉన్నవారు కీర దోసకాయను పూర్తిగా తగ్గించుకోవడం మంచిది. వారి శరీరంలో చల్లదనం పెరగడం వల్ల అసౌకర్యాలు మరింత అధికమవుతాయి.
అలాగే బలహీనమైన జీర్ణవ్యవస్థ కలిగినవారు కూడా కీర దోసకాయను జాగ్రత్తగా తీసుకోవాలి. ఇందులో ఉండే కుకుర్బిటాసిన్ అనే సహజ సమ్మేళనం వల్ల చేదు రుచి వస్తుంది. IBS, అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారికి కుకుర్బిటాసిన్ హానికరం. కీర దోసకాయలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల సున్నితమైన జీర్ణవ్యవస్థ కలిగిన వారికి అసౌకర్యం కలుగుతుంది. అందుకే ఇలాంటి వారు కీర దోసకాయ తక్కువ మోతాదులో లేదా పూర్తిగా నివారించడం మంచిది.