భారత రిజర్వ్ బ్యాంక్ ఇటీవల తీసుకున్న కీలక ద్రవ్య విధాన నిర్ణయం సాధారణ ప్రజలకు, ముఖ్యంగా రుణగ్రాహులకు భారీ ఊరటను అందించింది. ఆర్బీఐ రెపో రేటును 5.50% నుండి 5.25%కి తగ్గించడం వల్ల ఆర్థిక వ్యవస్థలో రుణాల ఖర్చు తగ్గి, బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను తగ్గించక తప్పని పరిస్థితి ఏర్పడింది. 25 బేసిస్ పాయింట్ల తగ్గుదలతో మొత్తం మార్కెట్‌లో రుణాలపై వడ్డీ భారం తగ్గబోతోందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పలు బ్యాంకులు వెంటనే రేట్లు తగ్గిస్తూ వినియోగదారులకు తాజా రిలీఫ్ ప్రకటించాయి.
సెంట్రల్ బ్యాంక్ నిర్ణయాన్ని అనుసరించి బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటిగా స్పందించింది. ఈ బ్యాంక్ తన లింక్డ్ లెండింగ్ రేటును 8.30% నుండి 8.10%కి తగ్గించింది. డిసెంబర్ 5 నుండి ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. తరువాత ఇండియన్ బ్యాంక్ కూడా కస్టమర్లకు ఉపశమనాన్ని అందిస్తూ లెండింగ్ రేటును 8.20% నుండి 7.95%కి తగ్గించింది. అదనంగా, మార్చినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటుపై (MCLR) 5 బేసిస్ పాయింట్ల కోత అమలు చేసింది. డిసెంబర్ 6 నుండి ఈ తగ్గుదల అమల్లో ఉంది. మరో పెద్ద బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా వడ్డీ రేటును 8.15% నుండి 7.90%కి తగ్గించింది.
ఇక కరూర్ వైశ్యా బ్యాంక్ కూడా ఆర్బీఐ నిర్ణయాన్ని అనుసరిస్తూ, తన MCLRను 9.55% నుండి 9.45%కి తగ్గించింది. డిసెంబర్ 7 నుండి ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా వడ్డీ రేట్లలో కోత ప్రకటించి డిసెంబర్ 6 నుంచే అమలులోకి తెచ్చింది. ఈ వరుస మార్పులు రుణగ్రాహుల మంత్లీ EMIలను తగ్గించడంలో కీలకపాత్ర పోషించనున్నాయి. గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు అన్ని విభాగాల్లో వడ్డీ రేట్లు తగ్గుతుండటంతో ఆర్థిక ఒత్తిడి తగ్గుతుందని బ్యాంకర్లు చెబుతున్నారు.
బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గుదల వల్ల కొత్త రుణాలు తీసుకునేవారికి కూడా భారీ లాభమే. తక్కువ రెపో రేటు కారణంగా రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడం, ఇప్పటికే ఉన్న రుణగ్రాహులకు EMI తగ్గడం, మార్కెట్‌లో డిమాండ్ పెరగడం— అన్ని కలిసి ఆర్థిక వ్యవస్థకు పాజిటివ్ సిగ్నల్‌గా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని బ్యాంకులు కూడా తమ రేట్లను సవరించే అవకాశం ఉండటంతో వినియోగదారులకు ఇంకా మెరుగైన అవకాశాలు లభించనున్నాయి.