ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు. ఉద్యోగులు ఈహెచ్ఎస్ (Employees Health Scheme) ద్వారా పొందుతున్న వైద్య సేవల్లో ఉన్న లోపాలను పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదులు, చికిత్సలు, బిల్లులు, హాస్పిటల్ సర్వీస్ వంటి అంశాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న కష్టాలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ కె. విజయానంద్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈహెచ్ఎస్ వ్యవస్థను సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వ ఉద్యోగులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఏ మార్పులు చేయాలి అనే విషయంపై అధ్యయనం చేస్తుంది. అందుతున్న సేవల స్థితి, లోపాలు, ఉద్యోగుల ఫిర్యాదులను పరిశీలించి పూర్తి నివేదికను సిద్ధం చేస్తుంది.
ఈ కమిటీలో సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా ఉన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్, ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సభ్యులుగా నియమితులయ్యారు. దీంతో ఉద్యోగుల అభిప్రాయాలు, వాటి అవసరాలు కూడా నివేదికలో చేరే అవకాశం ఉంటుంది.
ఇది ఉద్యోగులకు పెద్ద ఉపశమనం అవుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఈహెచ్ఎస్ కార్డుల ద్వారా చికిత్స పొందడంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని హాస్పిటళ్లు క్లెయిమ్ సమస్యలు, బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం, అవసరమైన సేవలు అందకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ కమిటీ ఈ సమస్యలన్నింటినీ విశ్లేషించి పరిష్కార మార్గాలు సూచించనుంది.
ప్రభుత్వం కమిటీకి 8 వారాల గడువు నిర్ణయించింది. ఈ వ్యవధిలో పూర్తిస్థాయి రిపోర్ట్‌ను సమర్పించాలి. ఆ నివేదిక ఆధారంగా ఈహెచ్ఎస్ విధానాన్ని మరింత బలపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలు మెరుగైన ఆరోగ్య సేవలు పొందే అవకాశముంది.