మాంసాహారం తినే వారిలో చాలా మందికి కేవలం ముక్కలే కాకుండా, 'లివర్' (కాలేయం) తినే అలవాటు ఉంటుంది. కొందరు చికెన్ లివర్ మెత్తగా ఉంటుందని ఇష్టపడితే, మరికొందరు మటన్ లివర్ రుచిగా ఉంటుందని తింటారు. వాస్తవానికి, సాధారణ మాంసం ముక్కల కంటే లివర్‌లో పోషకాలు చాలా రెట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిని "ప్రకృతి ప్రసాదించిన మల్టీ-విటమిన్" అని కూడా పిలుస్తారు.
అయితే చికెన్ లివర్, మటన్ లివర్‌లలో ఏది ఎక్కువ శక్తిని ఇస్తుంది? వీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఎవరెవరు వీటిని తినకూడదో వివరంగా తెలుసుకుందాం.
చికెన్ లివర్: తక్కువ ధర.. ఎక్కువ లాభాలు!
చికెన్ లివర్ తినడం వల్ల శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు (Micronutrients) లభిస్తాయి. ఇందులో ఉండే 'సెలీనియం' అనే ఖనిజం శరీరంలోని కణాలను రక్షించి, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్ ఏ మరియు బి12 పుష్కలంగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడటమే కాకుండా, మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
వయస్సు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపును ఇది అడ్డుకుంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి చికెన్ లివర్ ఒక మంచి ప్రోటీన్ వనరు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రించడంలో తోడ్పడుతుంది. వేయించిన కూరలా కాకుండా, ఉడికించిన (Boiled) చికెన్ లివర్‌ను మితంగా తింటే శరీరంలో అనవసరమైన కొవ్వు కరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మటన్ లివర్ విషయానికి వస్తే.. చాలామంది చికెన్ లివర్ కంటే మటన్ లివర్ తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. మటన్ లివర్‌లో విటమిన్లు ఏ, డీ, బీ12, జింక్, పొటాషియం, కాపర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి మటన్ లివర్ ఒక మంచి ఆహారం అని చెప్పొచ్చు.
ఇది రక్త స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. విటమిన్ బీ12 శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తుంది. అయితే ఇన్ని పోషకాలు ఉన్న చికెన్, మటన్ లివర్‌ను కొందరు తినకూడదు. అలా తింటే లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు, గుండె జబ్బులతో బాధపడుతున్నవారు, గర్భిణీ స్త్రీలు చికెన్ లేదా మటన్ లివర్‌ను తినకూడదు. ఈ వ్యక్తులు తినడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి.