ప్రజలను మోసం చేయడానికి నేరగాళ్లు రోజుకో కొత్త మార్గాన్ని కనిపెడుతున్నారు. ఒక మోసం బయటపడేలోపే మరో కొత్త పద్ధతితో మళ్లీ అమాయకులను ఉచ్చులోకి లాగుతున్నారు. అవసరాలు, ఆర్థిక ఇబ్బందులు, తక్షణ నగదు అవసరం వంటి పరిస్థితులను ఆసరాగా చేసుకుని ప్రజల బలహీనతలను తమ లాభంగా మార్చుకుంటున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ‘వడ్డీ లేని గోల్డ్ లోన్’ మోసం దీనికి స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోంది. నిజంగా వినడానికి ఆకర్షణీయంగా కనిపించే ఈ ఆఫర్ వెనుక భారీ మోసం దాగి ఉందని పోలీసులు తెలుపుతున్నారు.
సాధారణంగా బ్యాంకులు లేదా గుర్తింపు పొందిన ఫైనాన్స్ సంస్థలు బంగారాన్ని తాకట్టు పెట్టుకుని రుణం ఇస్తాయి. ఇందుకు కొంత వడ్డీ వసూలు చేస్తాయి. రుణంతో పాటు వడ్డీ చెల్లించిన తర్వాతే బంగారం తిరిగి ఇస్తాయి. కానీ “ఒక్క రూపాయి కూడా వడ్డీ లేదు”, “ఏడాది పాటు వడ్డీ ఫ్రీ గోల్డ్ లోన్” అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టిన కొందరు వ్యక్తులు ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసుకుని ఈ మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది.
కేరళలో ఈ తరహా ఘటనలు వరుసగా బయటపడుతున్నాయి. వడకుంబాద్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తనను తాను ఒక సంస్థ ప్రతినిధిగా పరిచయం చేసుకుని, వడ్డీ లేకుండా గోల్డ్ లోన్ ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మించాడు. రుణం మంజూరు చేయాలంటే ముందుగా బంగారం ఇవ్వాలని, అలాగే కొన్ని ప్రాసెసింగ్ ఖర్చులు ఉంటాయని చెప్పి వారి నుంచి నగదు కూడా వసూలు చేశాడు. ఒక మహిళ నుంచి సుమారు 60 గ్రాములకు పైగా బంగారం తీసుకోవడంతో పాటు లక్షల రూపాయల నగదు కూడా కాజేశాడు. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా బంగారం తిరిగి రాకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
ఫిర్యాదు అందుకున్న కేరళ పోలీస్ దర్యాప్తు ప్రారంభించింది. విచారణలో ఈ మోసం ఒకరిదే కాదని, ఒక బృందంగా ఏర్పడి చేస్తున్నట్లు గుర్తించారు. ఒక సంస్థ పేరుతో ఖాతాలు తెరిచి, నకిలీ పత్రాలు తయారు చేసి ప్రజలను నమ్మించినట్లు తేలింది. ఇప్పటివరకు ఈ కేసులో రూ.3 కోట్లకు పైగా మోసం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించిన మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోజికోడ్ సహా పలు ప్రాంతాల్లో ఇలాంటి కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఘటనలపై పోలీసులు ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బ్యాంకులు, ప్రభుత్వ అనుమతి ఉన్న ఫైనాన్స్ సంస్థలు తప్ప మరెవరి వద్దా బంగారం తాకట్టు పెట్టవద్దని సూచిస్తున్నారు. వడ్డీ లేకుండా రుణం అనే ఆఫర్ వాస్తవానికి అసాధ్యమని, అలాంటి మాటలు వినగానే అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఎలాంటి రుణమైనా అధికారిక పత్రాలు, రసీదులు లేకుండా నగదు లేదా బంగారం ఇవ్వడం చాలా ప్రమాదకరమని స్పష్టం చేస్తున్నారు.
ఆర్థిక అవసరాలు ఎంత ఉన్నా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. కాస్త ఆలోచన, సరైన సమాచారం ఉంటే ఇలాంటి మోసాలను తప్పించుకోవచ్చని అంటున్నారు. ‘సులువుగా డబ్బు’, ‘వడ్డీ లేదు’ అనే మాటలు విన్నప్పుడు ఒకసారి కాదు, రెండుసార్లు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ ఘటనలు చెబుతున్నాయి. అప్రమత్తతే భద్రత అనే మాటను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.