ఇటీవలి కాలంలో పిల్లలు ఎక్కువగా టీవీ, మొబైల్ స్క్రీన్‌ల ముందే సమయం గడుపుతున్నారు. ముఖ్యంగా కార్టూన్లు పిల్లల జీవితంలో భాగమయ్యాయి. అయితే ప్రతి కార్టూన్ కూడా పిల్లల మానసిక ఎదుగుదలకు ఉపయోగపడుతుందా అంటే నిపుణులు మాత్రం కచ్చితంగా కాదు అని చెబుతున్నారు. తాజాగా ఒక వీడియోలో పలు ప్రముఖ పిల్లల కార్టూన్లపై చేసిన విశ్లేషణ ఇప్పుడు తల్లిదండ్రుల్లో చర్చకు దారితీస్తుంది. పిల్లల ప్రవర్తన, ఏకాగ్రత, భావోద్వేగాలపై ఈ షోలు చూపే ప్రభావాన్ని ఆధారంగా చేసుకుని నిపుణులు డాక్టర్లు సైతం ఇచ్చారు.
చిన్నారుల్లో బాగా పాపులర్ అయిన కోకోమెలన్ కు ఈ విశ్లేషణలో 10/0 రేటింగ్ ఇచ్చారు. వేగంగా మారే సీన్లు, అధిక శబ్దంతో కూడిన పాటలు పిల్లలను వెంటనే ఆకట్టుకున్నా, దీర్ఘకాలంలో వారి ఏకాగ్రతను తగ్గిస్తాయని తెలుపుతున్నారు.
మాషా అండ్ ది బేర్ కూడా సున్నా రేటింగ్‌కే పరిమితమైంది. ఇందులో ఉండే అతి వేగం, గందరగోళ ప్రవర్తన పిల్లల్లో అదే తరహా అలవాట్లు పెంచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇక పెప్పా పిగ్ కు 10 కి 4రేటింగ్ ఇచ్చారు. ఈ కార్టూన్ సరళంగా ఉన్నప్పటికీ, పాత్రలు కొన్నిసార్లు మొండిగా మాట్లాడటం, మాట వినకపోవడం వంటి అంశాలు పిల్లలు అనుకరించే అవకాశముందని చెబుతున్నారు.
పిల్లల కోసం అత్యుత్తమమైన కార్టూన్‌గా "బ్లూయీ" ను నిపుణులు ప్రశంసించారు. దీనికి పూర్తి10/10 ఇచ్చారు. కుటుంబ బంధాలు, భావోద్వేగాలను ఎలా వ్యక్తపరచాలి, స్నేహం, సహనం వంటి విలువలను చాలా సహజంగా ఈ షో చూపిస్తుందని పేర్కొన్నారు. పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా చూసేలా ఉండటం దీని ప్రత్యేకతగా నిలిచింది.
యాక్షన్ ఎక్కువగా ఉండే “పా పెట్రోల్” కు 10/3 రేటింగ్ మాత్రమే ఇచ్చారు. ఇది ఉత్సాహంగా ఉన్నప్పటికీ, నిరంతరం స్క్రీన్ మార్పులు, ప్రమాద సన్నివేశాలు పిల్లల దృష్టిని చీల్చే అవకాశం ఉందని అభిప్రాయం. అలాగే “కుంగ్ ఫూ పాండా” కు 10/6 మార్కులు ఇచ్చారు. ప్రేరణ కలిగించే కథ ఉన్నా, యాక్షన్ ఎక్కువగా ఉండటం వల్ల చిన్న పిల్లలకు కొంత భారంగా మారొచ్చని విశ్లేషణ.
అయితే అత్యంత తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్న షో డయానా అండ్ రోమా. దీనికి మైనస్ పది రేటింగ్ ఇచ్చారు. ఖరీదైన బొమ్మలు, వస్తువుల పట్ల ఆకర్షణ పెంచడం, కావాల్సింది దొరకకపోతే మారాం చేయడం వంటి ప్రవర్తనలకు ఇది కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లల్లో అవసరాల కంటే కోరికలను ఎక్కువ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇంటరాక్టివ్ షోలైన “డోరా ది ఎక్స్‌ప్లోరర్ లాంటి కార్యక్రమాలకు 10/7 ఇచ్చారు. సమస్యలను ఆలోచించి పరిష్కరించే నైపుణ్యం, భాషా అభివృద్ధికి ఇవి కొంతవరకు సహాయపడతాయని పేర్కొన్నారు. అలాగే “బ్లూస్ క్లూస్ వంటి సింపుల్ షోలకు 10/3 మాత్రమే దక్కింది. నేర్చుకునే అంశాలు పరిమితంగా ఉండటమే కారణంగా చెప్పారు. సూపర్ సింపుల్ సాంగ్స్ కు ఎనిమిది రేటింగ్ ఇచ్చారు. స్పష్టమైన పదాలు, పునరావృత పాటలు చిన్నారులకు ఉపయోగపడతాయని, అయితే భావోద్వేగాలపై నేర్పు మాత్రం తక్కువగా ఉంటుందని విశ్లేషించారు.
నిపుణులు చెబుతున్న విషయం ఒక్కటే. పిల్లలకు కార్టూన్లు ఎంచుకోవడం అనేది వారికి ఆహారం ఎంచుకోవడం లాంటిదే. వెంటనే నచ్చే జంక్ ఫుడ్ లాంటి షోలు తాత్కాలిక ఆనందం ఇచ్చినా దీర్ఘకాలంలో హాని చేస్తాయి. పౌష్టికాహారంలాంటి మంచి షోలు పిల్లల మానసిక ఎదుగుదలకు బలంగా నిలుస్తాయి. అందుకే తల్లిదండ్రులు కేవలం పిల్లలు అడిగారని కాకుండా, ఆ షో ఏం నేర్పుతోంది అనే కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు