వెనిజులా (venezuela) రాజకీయ సంక్షోభం మరోసారి అంతర్జాతీయ వేదికపై తీవ్ర దుమారం రేపుతోంది. ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (trump) తీసుకున్న నిర్ణయాలపై US మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మదురో ఒక డిక్టేటర్ అనే విషయాన్ని తాను ఖండించడం లేదని, అయితే ఆయనను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ చేపట్టిన చర్యలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని కమలా హారిస్ స్పష్టం చేశారు. ఇలాంటి నిర్లక్ష్యపూరిత నిర్ణయాలు అమెరికాను మరింత సురక్షితంగా చేయవని, అసలు సమస్యను పరిష్కరించకపోగా కొత్త ప్రమాదాలకు తావిస్తాయని ఆమె విమర్శించారు. ముఖ్యంగా చమురు ప్రయోజనాల కోసమే సైనిక చర్యలను ముందుకు నెట్టి, అమెరికన్ సైనికుల ప్రాణాలను పణంగా పెట్టడం బాధ్యతారాహిత్యమైన చర్య అని ఆరోపించారు.
ముందస్తు ప్రణాళిక లేకుండా, దౌత్య మార్గాలను పూర్తిగా విస్మరించి తీసుకునే ఇలాంటి నిర్ణయాల ప్రభావం చివరికి సామాన్య అమెరికన్ కుటుంబాలపై పడుతుందని కమలా హారిస్ హెచ్చరించారు. యుద్ధాలు, సైనిక జోక్యాలు ఎప్పటికీ సాధారణ ప్రజలకు ఆర్థిక భారాన్ని మిగులుస్తాయని, ధరల పెరుగుదల నుంచి పన్నుల భారం వరకు అనేక సమస్యలను తెచ్చిపెడతాయని ఆమె పేర్కొన్నారు. వెనిజులా సంక్షోభాన్ని ఆయిల్ రాజకీయాలతో ముడిపెట్టి చూడటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, ఇది అమెరికా విలువలకు, ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తి విరుద్ధమని హారిస్ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్టును ఖండించిన కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతర్జాతీయ దౌత్య మర్యాదలను పక్కన పెట్టి, వ్యక్తిగత స్థాయికి దిగజారి విమర్శలు చేయడం మరోసారి ట్రంప్ వైఖరిని బయటపెట్టింది. కొలంబియా నుంచి డ్రగ్స్ అమెరికాకు చేరుతున్నాయంటూ పెట్రోపై ఆరోపణలు చేస్తూ, “తన A** చూసుకుని మాట్లాడాలి” అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. దీనికి ప్రతిగా గుస్తావో పెట్రో స్పందిస్తూ, వెనిజులా సార్వభౌమత్వంపై ఇది ఒక సామ్రాజ్యవాద దాడిగా అభివర్ణించారు. లాటిన్ అమెరికా దేశాలపై అమెరికా దోపిడీ ధోరణి కొనసాగుతూనే ఉందని ఆయన ఆరోపించారు.
అదే సమయంలో, అమెరికా హోం సెక్రటరీ మార్కో రుబియో చేసిన పరోక్ష వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత మంటపెట్టాయి. వెనిజులా తర్వాత అమెరికా లక్ష్యంగా క్యూబా, మెక్సికో వంటి దేశాలు ఉండవచ్చని ఆయన సంకేతాలు ఇవ్వడం లాటిన్ అమెరికా దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే, వెనిజులా అంశం కేవలం ఒక దేశానికి సంబంధించిన సమస్య కాకుండా, అమెరికా విదేశాంగ విధానంలోని లోపాలు, ఆయిల్ రాజకీయాలు, సామ్రాజ్యవాద ధోరణులను మరోసారి ప్రపంచానికి చూపిస్తున్నాయి. కమలా హారిస్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్ విధానాలపై దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనంగా మారాయి.