కార్పొరేట్ ప్రపంచంలో జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ప్రత్యేక శైలికి పేరుగాంచారు. అయితే ఇటీవలి కాలంలో ఆయనపై ‘అమానవీయ బాస్’ అన్న ఆరోపణలు సోషల్ మీడియాలో తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారన్న విమర్శలు ఊపందుకోవడంతో, ఈ అంశంపై గోయల్ తొలిసారిగా బహిరంగంగా స్పందించారు. ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ షామానీ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న దీపిందర్, తనపై వచ్చిన ఆరోపణలను ఒక్కొక్కటిగా ఖండించారు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తల్లో వాస్తవం లేదని, కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 2025లో జొమాటో 500 నుంచి 600 మంది కస్టమర్ సపోర్ట్ ఉద్యోగులను ఒక్కసారిగా తొలగించిందన్న వార్తపై రాజ్ షామానీ ప్రశ్నించగా, దీపిందర్ గోయల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “ఆ వార్త పూర్తిగా తప్పు. నిజానికి నెలల తరబడి పనితీరు సమీక్షలు, ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత కేవలం 20 మందిని మాత్రమే తొలగించాం” అని స్పష్టం చేశారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఉద్యోగులను తొలగించారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. రెడిట్‌లో ఎవరో పెట్టిన ఒక పోస్ట్‌ను ఆధారంగా తీసుకుని, సోషల్ మీడియాలో అనవసరమైన ‘డ్రామా’ సృష్టించారని, అలాంటి కథనాలకు స్పందిస్తే మరింత ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందనే మౌనంగా ఉన్నామని వివరించారు.
ఒక ఉద్యోగిని కేవలం 28 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకే ఉద్యోగం నుంచి తొలగించారన్న ఆరోపణపై దీపిందర్ మరింత ఘాటుగా స్పందించారు. “కస్టమర్ కేర్ అనేది క్లాక్-టు-క్లాక్ జాబ్. అక్కడ కెపాసిటీ ప్లానింగ్ ఉంటుంది. ఒక వ్యక్తి ఆలస్యంగా వస్తే ఆ సమయంలో కస్టమర్లకు సేవ అందించే వారు ఉండరు. అందరూ ఇలా చేయడం మొదలుపెడితే సంస్థ ఎలా నడుస్తుంది?” అని ప్రశ్నించారు. సదరు ఉద్యోగికి ముందే పలుమార్లు హెచ్చరికలు జారీ చేశామని, పనితీరు మెరుగుపరుచుకునేందుకు అవకాశాలు ఇచ్చామని, అయినప్పటికీ మార్పు కనిపించకపోవడంతోనే చర్యలు తీసుకున్నామని గోయల్ వెల్లడించారు.
ఈ పాడ్‌కాస్ట్‌లో గోయల్ తన వాదన వినిపిస్తుండగానే, మరోవైపు జొమాటో దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల నిరసనలను ఎదుర్కొంటోంది. తక్కువ వేతనాలు, సామాజిక భద్రత లేకపోవడం, పని ఒత్తిడి వంటి అంశాలపై డిసెంబర్ 25, 31 తేదీల్లో డెలివరీ బాయ్స్ భారీగా సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో దీపిందర్ చేసిన వ్యాఖ్యలు కార్పొరేట్ వర్గాలు, సోషల్ మీడియా సర్కిల్స్‌లో పెద్ద చర్చకు దారితీశాయి. ఒకవైపు సంస్థ క్రమశిక్షణపై గోయల్ గట్టి వాదన వినిపిస్తుండగా, మరోవైపు కార్మిక హక్కులపై ప్రశ్నలు మరింత బలపడుతున్నాయి.