అమాయకుల నిరుద్యోగాన్ని ఆసరాగా చేసుకుని, వారి పేర్లపై బ్యాంక్ ఖాతాలు తెరిపించి, వాటిని విదేశాల్లోని సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను విజయవాడ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ‘అద్దె ఖాతాలు’ పేరుతో సాగుతున్న ఈ అక్రమ దందాలో ముగ్గురు కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, ఈ వ్యవహారానికి అంతర్జాతీయ స్థాయి లింకులు ఉన్నట్లు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన భారీ ఆన్‌లైన్ మోసాలకు ఈ ఖాతాలే వేదికగా మారినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముఠా ప్రధానంగా నిరుద్యోగులను, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని టార్గెట్ చేసేది. వారికి సులభంగా డబ్బు వస్తుందన్న ఆశ చూపి కరెంట్ ఖాతాలు తెరిపించేది. విజయవాడకు చెందిన దేవదాసు అనే నిరుద్యోగి పేరుతో కూడా ఇదే విధంగా ఖాతా తెరిపించి, కేవలం రూ.7 వేల నగదు ఇచ్చారు. అయితే ఇటీవల తన ఖాతా స్టేట్‌మెంట్‌ను పరిశీలించిన దేవదాసు.. అందులో ఏకంగా రూ.2 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు గమనించి షాక్‌కు గురయ్యాడు. తాను తెలియకుండానే తన ఖాతా అక్రమ కార్యకలాపాలకు వాడబడిందని తెలుసుకుని వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ భారీ సైబర్ స్కామ్ బయటపడింది.
విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఈ ముఠా సేకరించిన బ్యాంక్ ఖాతాల కిట్లు, చెక్ బుక్స్, డెబిట్ కార్డులను పార్వతి అనే మహిళ ద్వారా ఫిలిప్పీన్స్‌లోని ప్రధాన సైబర్ నేరగాళ్లకు చేరవేసేది. అక్కడి నుంచి ఆన్‌లైన్ బెట్టింగ్, డిజిటల్ మోసాలు, అక్రమ లావాదేవీల ద్వారా వచ్చిన సొమ్మును ఈ ఖాతాల్లోకి మళ్లించేవారు. ఒక్కో ఖాతాకు ఈ ముఠాకు రూ.30 వేల వరకు కమీషన్ అందినట్లు పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్ వంటి రాష్ట్రాల్లో జరిగిన అనేక సైబర్ మోసాలకు ఇదే ఖాతాలు వాడినట్లు నిర్ధారించారు.
ఈ ముఠా నాయకుడిగా భావిస్తున్న సూర్య గతంలో ఆగ్రాలో ఇదే తరహా కేసులో జైలుకు వెళ్లి బయటకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. విడుదలైన తర్వాత టెలిగ్రామ్ యాప్‌ను వేదికగా చేసుకుని మళ్లీ ఈ అక్రమ దందాను విస్తరించినట్లు తేలింది. మరింత షాకింగ్ విషయం ఏమిటంటే.. నిందితుడు ఉపయోగించిన కారుపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేరుతో ఉన్న ‘ఎమ్మెల్యే’ స్టిక్కర్‌ను పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా రెండు కార్లు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, కీలక నిందితురాలు పార్వతి కోసం గాలిస్తున్నారు. అమాయకులు తమ ఖాతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు అప్పగించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.