దక్షిణ అమెరికాలోని వెనిజులా ఒక్కసారిగా యుద్ధ భూమిగా మారింది. శనివారం తెల్లవారుజామున అమెరికా సైన్యం ఊహించని రీతిలో వెనిజులా రాజధాని కరాకస్‌పై మెరుపు వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో కనీసం 40 మంది పౌరులు, సైనికులు మృతి చెందగా… పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఆపరేషన్‌లోనే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా ప్రత్యేక దళాలు అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించాయి. ఇరాక్ యుద్ధం తర్వాత, మరో దేశంలో అధికార మార్పిడి లక్ష్యంగా అమెరికా చేపట్టిన అతిపెద్ద సైనిక చర్యగా ఈ దాడిని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
మదురోను అరెస్ట్ చేసిన వెంటనే అమెరికా యుద్ధ నౌకలో న్యూయార్క్‌కు తరలించారు. ఆయన చేతులకు సంకెళ్లు వేసి, కళ్లకు గంతలు కట్టిన ఫోటోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. న్యూయార్క్‌లోని స్టీవర్ట్ ఎయిర్ నేషనల్ గార్డ్ బేస్‌కు చేరుకున్న మదురోను అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. వచ్చే వారం ఆయనపై నార్కో-టెర్రరిజం, డ్రగ్స్ అక్రమ రవాణా, ఆయుధాల స్మగ్లింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలపై ఫెడరల్ కోర్టులో విచారణ జరగనుంది.
ఈ పరిణామాల అనంతరం అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. “వెనిజులాలో స్థిరమైన ప్రజాస్వామ్యం పునరుద్ధరించే వరకు ఆ దేశ పాలన బాధ్యతలను అమెరికాయే చూసుకుంటుంది” అని స్పష్టం చేశారు. అంతేకాదు, వెనిజులాలో ఉన్న విస్తారమైన చమురు వనరులను అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించి ఆదాయం పొందుతామని వ్యాఖ్యానించారు. “వెనిజులా భవిష్యత్తు ఇక అమెరికా చేతుల్లోనే ఉంటుంది” అనేలా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ దాడికి కేవలం 48 గంటల ముందే మదురో అమెరికాతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. డ్రగ్స్ నియంత్రణ, చమురు రంగంలో అమెరికా పెట్టుబడులకు తాము సహకరిస్తామని ‘టెలిసూర్’ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఆ ప్రతిపాదనలను పూర్తిగా పక్కనపెట్టి అమెరికా ఈ దాడులకు దిగడం గమనార్హం. ఈ సైనిక చర్యపై రష్యా, చైనా, లాటిన్ అమెరికా దేశాలు, యూరప్ దేశాలు తీవ్రంగా స్పందించాయి. అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అంటూ ఖండించాయి. అమెరికాలోనే ఈ ఆపరేషన్ చట్టబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది డ్రగ్స్ కేసు కంటే అధికార మార్పిడి లక్ష్యంతో చేసిన దాడి మాత్రమేనని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.